హీరోల రెమ్యున‌రేష‌న్‌ గుట్టు విప్పిన వివాదాల‌ హీరో!

Thursday, March 22nd, 2018, 09:20:29 PM IST

హీరోల పారితోషికం బ‌డ్జెట్‌లో స‌గం ఎందుకు ఉంటుంది? ఈ సీక్రెట్ గుట్టు విప్ప‌గ‌ల‌రా? సినిమా బ‌డ్జెట్‌లో స‌గం మొత్తం పారితోషికంగా అందుకునే హీరోలు మ‌న‌కు ఎందుకు ఉన్నారు. ప‌వ‌న్‌, మ‌హేష్ స‌హా చాలా మంది స్టార్ల‌ పారితోషికం ఆ రేంజులోనే ఉంటుంది క‌దా!. అయితే అంత మొత్తం అందుకోవ‌డం వెన‌క అస‌లు ర‌హ‌స్యం ఏంటో చెప్ప‌గ‌ల‌రా ఎవ‌రైనా? ప్చ్‌.. సామాన్యుల అంచ‌నాకు దొర‌క‌ని ఈ మ్యాట‌ర్ గుట్టును విప్పాడు త‌మిళ హీరో శింబు.

వివాదాస్ప‌ద హీరోగా అంద‌రికీ సుప‌రిచిత‌మైన శింబు.. నిన్న‌టిరోజున అనూహ్యంగా త‌మిళనాడు థియేట‌ర్ యాజ‌మాన్యం ఏర్పాటు చేసిన ఓ స‌మావేశానికి అటెండ‌య్యాడు. అది ఊహించ‌ని స‌ర్‌ప్రైజ్‌. అంతేకాదు.. ఆ స‌మావేశంలో శింబు ఊహాతీత‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టాడు. “అస‌లు సినిమా టికెటింగ్ విధానం కంప్యూట‌రైజ్డ్ చేసి, బాక్సాఫీస్ లెక్కలు వాస్త‌వికంగా.. బ‌హిరంగంగా చూపిస్తే,.. హీరోల పారితోషికాలు ఎందుకు అంత తీసుకుంటున్నారో బ‌య‌ట‌ప‌డుతుంది“ అని అన్నాడు. ఓ ర‌కంగా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ల‌ను బ‌ట్టి .. పారితోషికం తీసుకుంటారని సంచ‌ల‌న‌ వ్యాఖ్య చేశాడు శిలాంబ‌ర‌స‌న్ అలియాస్‌ శింబు. వాస్త‌వానికి సినిమా బిజినెస్ అనేది `హీరో`పై ఆధార‌ప‌డి న‌డిచేది. 100 కోట్లు వ‌సూలు చేసింది అంటే హీరో ముఖ విలువ‌ను బ‌ట్టి మాత్ర‌మే. నిర్మాత పెట్టుబ‌డి, ద‌ర్శ‌క‌త్వ ప్ర‌తిభ అనేవి ఆ త‌ర‌వాతే.. అలా మ‌న ఇండ‌స్ట్రీల‌న్నీ ఫిక్స‌యి ఉన్నాయ‌న్న మాట వాస్త‌వం. అందుకే హీరోలు అంత మొత్తం కొల్ల‌గొడ‌తార‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో ప‌రిశ్ర‌మ‌లో ట్రెండ్ మారింది. క‌థ బావుండి, కంటెంట్ ఉంటే హీరో ఎవ‌రు? అనేది చూడ‌కుండా జ‌నం థియేట‌ర్ల‌కు వెళ్ల‌డం నేటి ట్రెండ్‌. అయితే స్టార్ ప‌వ‌ర్ అనేది అద‌న‌పు అస్సెట్ అవుతోంది. మొత్తానికి శింబు చాలా పెద్ద చిక్కు ప్ర‌శ్న‌నే వేశాడు. ఓ ర‌కంగా సినిమా క‌లెక్ష‌న్స్ ఒరిజిన‌ల్‌గా ఎంత అనేది ఏ నిర్మాత కూడా రివీల్ చేయ‌రు. ఆదాయ‌పు ప‌న్ను క‌ట్టాల్సి ఉంటుంద‌ని కొన్ని దొంగ లెక్క‌లు చెబుతార‌ని, అలాగే టిక్కెట్ల అమ్మకాల‌న్నీ ఓ బ్ర‌హ్మ ర‌హ‌స్యం అని శింబు కుండ‌బ‌ద్ధ‌లు కొట్టాడ‌న్న‌మాట‌!