జగన్ క్రేజ్: డల్లాస్ ప్రైవేట్ మీటింగ్‌లో కాస్త నిరాశ..!

Sunday, August 18th, 2019, 09:47:40 PM IST

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి హొదాలో మొట్టమొదటి సారిగా అమెరికా వెళ్ళిన సీఎం జగన్‌కు అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారనే చెప్పాలి. అంతేకాదు జగన్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన దగ్గరి నుంచి డల్లాస్‌లో ప్రసంగించే సభ వరకు అన్ని విషయాలలోనూ కార్యక్రమ నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు.

అయితే సభకంటే ముందు ఏపీలో పెట్టుబడుల గురుంచి మరియు జగన్‌తో కాస్త ప్రైవేట్‌గా మాట్లాడాలనుకున్న వారికి కాస్త చేదు అనుభవం ఎదురయ్యిందనే చెప్పాలి. అయితే కొందరు బిజినెస్‌మేన్లు, లోకల్ తెలుగు ఆర్గనైజేషన్లతో ఒక ప్రైవేట్ మీటింగ్ నిర్వహించాలని ముందుగా అనుకున్నారు నిర్వాహకులు. అయితే ముఖ్యంగా జగన్ ప్రసంగించే హచిన్సన్ కన్వెన్షన్ సెంట్రల్ హాలును కాకుండా, ఒక చిన్న హాల్‌లో ఈ ప్రైవేట్ మీటీంగ్ నిర్వహించాలని ఒక వంద మంది వరకు ప్రముఖులను ఇందులోకి ఆహ్వానించాలని అనుకున్నారు. అయితే ఈ మీటింగ్‌కి ఏకంగా 400 మంది హాజర్ కావడంతో ఆ చిన్న హాల్ కాస్త కిక్కిరిసిపోయింది. అయితే సేఫ్టీ అంశాలను పరిగణలోకి తీసుకున్న నేపధ్యంలో అక్కడి ఫైర్ సిబ్బంది కేవలం 200 మందిని మాత్రమే హాల్‌లోకి అనుమతిచ్చారు. మిగతా వారిని భయటే ఉంచడంతో సమయం తక్కువ ఉన్న నేపధ్యంలో రెండు సార్లు ప్రైవేట్ మీటింగ్ నిర్వహించడం కష్టమని, భయట ఉన్న వారు నిరాశపడుతారని చెప్పి హచిన్సన్ కన్వెన్షన్ సెంట్రల్ హాలులోనే ఈ మీటింగ్ విషయాలు కూడా మాట్లాడుదామని జగన్ చెప్పాడు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం బాగానే ఉన్నా జగన్‌తో కాస్త ప్రైవేట్‌గా మాట్లాడాలనుకున్న చాలా మంది మాత్రం కాస్త నిరాశ పడ్దారని సమాచారం.