హాట్ స్టోరి : శాటిలైట్ బిజినెస్‌లో స‌రికొత్త స్పీడ్‌

Wednesday, December 6th, 2017, 11:27:06 AM IST

స‌రిగ్గా రెండేళ్ల క్రితం.. బాహుబ‌లి రిలీజ్‌కి ముందు .. తెలంగాణ డివైడ్ త‌ర్వాత‌.. తెలుగు సినిమా ప‌రిస్థితి అత్యంత ధీనం.. ధైన్యం. అప్ప‌టికే చిన్నా చిత‌కా హీరోల స్థాయి కిందికిందికి వెళ్లిపోయింది. స‌క్సెస్ లేక‌.. అంతగా ముఖ విలువ లేని హీరోల సినిమాల్ని కొనేందుకు తెలుగు టీవీ చానెళ్లు స‌సేమిరా అనేశాయి. శ‌తాధిక చిత్రాల క‌థానాయ‌కుడు శ్రీ‌కాంత్ సినిమాకే శాటిలైట్ ద‌క్క‌ని ప‌రిస్థితి త‌లెత్తింది. 50 సినిమాల్ని రికార్డ్ టైమ్‌లో పూర్తి చేసిన అల్ల‌రి న‌రేష్‌కే శాటిలైట్ క‌ష్ట‌మైపోయిందంటే.. స‌న్నివేశం అర్థం చేసుకోవాలి. ఇక త‌నీష్‌, వ‌రుణ్ సందేశ్, త‌రుణ్, .. ఇలా లైమ్‌లైట్ లో లేని హీరోలు అప్పుడ‌ప్పుడు సినిమాలు చేస్తున్నా.. శాటిలైట్ కొనేవాళ్లే క‌రువైపోయారు. దాంతో ఒక్క‌సారిగా ఇండ‌స్ట్రీలో ఏదో తెలియ‌ని భ‌యం. ఈ ఇండ‌స్ట్రీకి ఏమైంది? అస‌లేం జ‌రుగుతోంది? అంటూ ముఖేష్‌ని ఉద‌హ‌రిస్తూ జోకులు పేల్చేవారు.

ఇప్ప‌ట్లో ఇండ‌స్ట్రీ కోలుకుంటుందా? అంటూ విమ‌ర్శ‌కులు, విశ్లేష‌కులు సైతం నోరెళ్ల‌బెట్టారు. చిన్న సినిమా బ‌తికేందుకు శాటిలైట్ ఎంతో ముఖ్యం. అలాంటి శాటిలైట్ ఇలా కుదేలైపోయిందేం దేవుడా! అంటూ మొర‌పెట్టుకున్నారంతా. క‌ట్ చేస్తే ఆర్నెళ్లు.. సంవ‌త్స‌రం ఇదే ప‌రిస్థితి. కానీ ఇప్పుడు.. ఇన్నాళ్టికి మ‌ళ్లీ చిన్న సినిమాకి మ‌హ‌ర్ధ‌శ ప‌ట్టుకుంది. శాటిలైట్ స్కైలో ఉందిప్పుడు. చిన్న హీరోల సినిమాలు, ముఖ‌ప‌రిచయం లేని.. అంత‌గా గుర్తింపు లేని హీరోల సినిమాల‌కైనా ఇప్పుడు శాటిలైట్ ఓ రేంజులో ప‌లుకుతోంది. ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాల‌కు శాటిలైట్‌, డిజిట‌ల్ రైట్స్ రూపంలోనే బోలెడంత రిట‌ర్నులు ద‌క్కుతున్నాయి. ఇప్ప‌టికిప్పుడు ఓ మూడు ప‌రిమిత బ‌డ్జెట్ సినిమాలు శాటిలైట్ బిజినెస్ క్రేజీగా ఫ్యాన్సీ ధ‌ర‌కు పూర్తి చేసుకోవ‌డం హాట్ టాపిక్ అయ్యింది. వరుణ్ తేజ్-రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న `తొలిప్రేమ` శాటిలైట్‌ను 3కోట్ల‌కు ప్ర‌ముఖ ఎంట‌ర్టైన్‌మెంట్ చానెల్ ద‌క్కించుకుంద‌ని తెలుస్తోంది. అలాగే, నాగ‌శౌర్య `ఛ‌లో`కి 2.52కోట్ల మేర శాటిలైట్ ప‌లికింది. అల్లు శిరీష్ `ఒక్క క్షణం`కి ఏకంగా 3.20 కోట్లు చెల్లించేందుకు ప్ర‌ముఖ టీవీ చానెల్ ఆఫ‌ర్ చేసింది. ఇక ఏడాది ఆరంభ‌మే సూప‌ర్‌హిట్ అయిన శ‌ర్వానంద్ `శ‌త‌మానం భ‌వ‌తి` అయితే పెద్ద హీరోల రేంజ్ శాటిలైట్ ద‌క్కించుకుంది. సందీప్ కిష‌న్‌, నారా రోహిత్‌, సుధీర్ బాబు వంటి యువ‌హీరోల సినిమాల‌కు శాటిలైట్ రేటు ఓ రేంజులో ప‌లుకుతోంది. ఇదంతా ఆహ్వానించ‌ద‌గ్గ శుభ‌ప‌రిణామం. క‌థ‌, కంటెంట్ బావుంటే హీరోల‌తో ప‌నేలేకుండా శాటిలైట్ బిజినెస్ జ‌రుగుతుండ‌డం మెచ్చ‌ద‌గిన ప‌రిణామం అనే చెప్పాలి.

  •  
  •  
  •  
  •  

Comments