సోనమ్ శ్రీమతి కానుందే..

Monday, April 16th, 2018, 01:29:12 PM IST

బాలీవుడ్ లో పెద్ద పెద్ద హీరోలతో నటించి, ఎన్నో ప్రతిష్టాత్మక చిత్రాలు చేసి తనకంటూ ఓ క్రేజ్ ని సంపాదించుకున్న షైనింగ్ స్టార్ ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌ గారాలపట్టి సోనమ్‌ కపూర్‌ పెళ్లి సందడి శురువైంది. సోనమ్‌ కపూర్.. దిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ అహూజాతో కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీరి ప్రేమ ఇప్పుడు పెళ్లి వరకు వచ్చి..మే మొదటి వారంలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటి కాబోతున్నారు. మొదట్లో స్విట్జర్లాండ్‌లో సోనమ్‌ వివాహం జరగబోతున్నట్లు పలు వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.

కానీ కుటుంబీకులంతా ముంబయిలోనే ఉండడంతో ఇక్కడే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారట. అయితే పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్‌ వేడుకలో డ్యాన్సులతో సందడి చేసేందుకు సోనమ్‌కు..ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఫరా ఖాన్‌ స్టెప్పులు కంపోజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా సోనమ్‌..ఫరాతో కలిసి దిగిన ఫొటోలను సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు.ఇప్పుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముంబయిలోని జుహు ప్రాంతంలో అనిల్‌కపూర్‌కి చెందిన బంగ్లాలో సంగీత్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నట్లు సోనమ్‌ సన్నిహితులు మీడియా ద్వారా వెల్లడించారు.

ఈ వేడుకకు సోనమ్‌, ఆనంద్‌ కుటుంబీకులంతా హాజరుకాబోతున్నారు. సోనమ్‌ నటించిన సినిమాల పాటలకే డ్యాన్సులు కంపోజ్‌ చేస్తున్నారు. వివాహం అనంతరం అనుష్క- విరాట్‌లాగే ముంబయి, దిల్లీలో ఘనంగా రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ప్రస్తుతం సోనమ్‌..‘వీరే ది వెడ్డింగ్‌’ చిత్రంలో నటిస్తు బిజీగా ఉన్నారు. వివాహమైన మూడురోజుల తర్వాత తిరిగి చిత్రీకరణలో తిరిగి పాల్గొంటారు. వైరల్ అయిన ఫోటోలపై మీరూ ఓ లిక్కేయండీ.

  •  
  •  
  •  
  •  

Comments