ఇంకో వారంలో ఓ ఇంటిదైపోతున్న సోన‌మ్‌

Wednesday, May 2nd, 2018, 04:44:57 PM IST

అందాల క‌థానాయిక .. క‌పూర్ గాళ్ సోన‌మ్ పెళ్లి ఇప్ప‌ట్లో ఉంటుందా? అన్న సందేహం క‌లిగింది. ఆక‌స్మికంగా కుటుంబ స‌భ్యురాలైన అతిలోక సుంద‌రి యాక్సిడెంట‌ల్ డెత్ ఈ పెళ్లికి అడ్డంకిగా మారుతుంద‌ని అంతా భావించారు. కానీ పెళ్లిని, చావును ఎవ‌రూ ఆప‌లేరంటారు. శ్రీ‌దేవి మ‌ర‌ణానికి ముందే సోన‌మ్ పెళ్లికి సంబంధించిన మంత‌నాలు సాగాయి. ఇక రేపో మాపో ల‌గ్గం పెట్టేస్తారు అన‌గానే శ్రీ‌దేవి పెద్ద షాకిచ్చింది. బోనీ క‌పూర్‌- అనీల్ క‌పూర్ సోద‌రుల‌కు అది ఊహించ‌ని విఘాతం. మొత్తానికి విషాదం నుంచి తేరుకుని ఎట్ట‌కేల‌కు ఆ ఇంట్లో ఓ వేడుక‌ను నిర్వ‌హించేందుకు రంగం సిద్ధ‌మ‌వుతోంది.

సోన‌మ్ పెళ్లితో క‌పూర్ కుటుంబం విషాదం నుంచి మ‌రింత బ‌య‌ట‌ప‌డేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే ఇన్నాళ్లు పెళ్లి తేదీ ఎప్పుడు అన్న‌ది ఫిక్స్ చేయ‌లేదు. తాజా అప్‌డేట్ ప్ర‌కారం.. ఆ ముహూర్తం కాస్తా ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. మే 8న సోన‌మ్ మెడ‌లో ఆనంద్ అహూజా మూడు ముళ్లు వేసే ముహూర్తం ఫిక్స‌యింది. 3000 కోట్ల ఆస్తిప‌రుడైన అహూజాని ఈ అమ్మ‌డు కొంగున క‌ట్టేసుకుంటోంద‌న్న ముచ్చ‌ట బాలీవుడ్‌లో స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెంచుతోంది. సోన‌మ్ సెల‌క్ష‌న్ గ్రేట్! అంటూ ఒక‌టే పొగిడేస్తున్నారు. మే 8 తేదీ ఫిక్స‌వ్వ‌గానే సోన‌మ్ కొలీగ్స్‌, అభిమానులు సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లతో మోత మోగించారు. అయితే ఈ అందాల భామ‌కు పెళ్ల‌యిపోయి .. త‌మ‌కు దూర‌మైపోతోంద‌న్న బాధ‌లో అభిమానులు కాస్తంత తేరుకోలేని స‌న్నివేశం క‌నిపిస్తోంది. అయితే పెళ్లికి ఫ్యాష‌న్ ప్ర‌పంచంతో అనుబంధానికి ఏ సంబంధం లేదు కాబ‌ట్టి పెళ్లి త‌ర‌వాత కూడా సోన‌మ్‌లోని ఫ్యాష‌నిస్టా గ్లింప్స్ చూడొచ్చన్న సంతోషం ఇంకా అలానే మిగిలి ఉంది.