ట్రెండీ టాక్‌ : స‌్పేస్ సైంటిస్ట్‌ క‌ల్ప‌నా చావ్లా బ‌యోపిక్

Friday, March 16th, 2018, 10:01:41 AM IST

స్పేస్‌లో ప్ర‌వేశించిన తొలి భార‌తీయ మ‌హిళా సైంటిస్టుగా క‌ల్ప‌నా చావ్లా చ‌రిత్ర‌కెక్కిన సంగ‌తి తెలిసిందే. ది గ్రేట్ రాకెట్ సైంటిస్ట్ కొలంబియా నౌఖ ప్ర‌మాదంలో ఆక‌శ్మికంగా మ‌ర‌ణించిన సంగ‌తిని మ‌రువ‌లేం. ఒక సాధాసీదా పేద కుటుంబం నుంచి సైన్స్ విధ్యార్థిగా గొప్ప స్థాయికి ఎదిగిన క‌ల్ప‌న అనే భార‌తీయ మ‌హిళ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని, అటుపై ఓ అమెరిక‌న్‌ని పెళ్లాడి, ర‌క‌ర‌కాల ప్ర‌యోగాల్లో భాగ‌స్వామి అయిన చ‌రిత్ర అంత తేలిగ్గా మ‌ర్చిపోయేది కానేకాదు. 2003, జనవరి 16 న ఎస్‌టిఎస్-107 కొలంబియా స్పేస్ షటిల్ లో 16 రోజుల అంతరిక్ష పరిశోధనకు అంతరిక్షంలోకి వెళ్లారు. ఆ క్ర‌మంలోనే అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భార‌తీయ మహిళ గా, భారత దేశ సంతతిలో అంతరిక్షయానం చేసిన రెండో వ్యక్తి గా క‌ల్ప‌న చ‌రిత్ర సృష్టించారు.

2003 జనవరి 16, చివరగా చావ్లా తిరిగి కొలంబియా స్పేస్ షిప్‌లో ప‌ని చేసి, 1ఫిబ్ర‌వ‌రి 2003లో భూమ్మీదికి తిరిగి వ‌స్తున్న టైమ్‌లో అది అర్థాంత‌రంగా కుప్ప‌కూల‌డంతో క‌ల్ప‌న అనంత‌లోకానికేగారు. ఇంత‌కంటే గొప్ప చ‌రిత్ర కావాలా? బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు. ది గ్రేట్ రాకేష్ శ‌ర్మ బ‌యోపిక్ తెర‌కెక్కిస్తున్న వేళ‌, ప్ర‌స్తుతం క‌ల్ప‌నా చావ్లా బ‌యోపిక్ స‌ర్వ‌త్రా చ‌ర్చ‌కొచ్చింది. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ప్రియాంక చోప్రా న‌టిస్తుండ‌డంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజు నెల‌కొంది. మ‌రో రెండు నెల‌ల్లో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌నుంది. పీసీ క్వాంటికో సిరీస్ పూర్తి చేసుకుని, ఇటువైపు వ‌స్తుంది. అప్పుడు షూటింగును ప్రారంభించ‌నున్నార‌ట‌. దాదాపు 12 ఏళ్లుగా ఈ స్క్రిప్టుపై శ్ర‌మించి, ప్రియా మిశ్రా అనే డెబ్యూ ద‌ర్శ‌కుడు ఓ కొత్త నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.