మహిళల మీద స్పీకర్ తీవ్ర వ్యాఖ్యలు

Thursday, February 9th, 2017, 10:46:47 AM IST


మహిళలు ఇంట్లోనే ఉండిపోయి వంటింటికి పరిమితం అయితే ఎలాంటి ఇబ్బందులు, వేధింపులూ , దాడులూ జరగవు అనీ బయటకి వెళ్లి ఉద్యోగమో వ్యాపారమో చేస్తేనే ఇలాంటి తలనొప్పులు అన్నీ వస్తాయి అని ఏపీ అసంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వ్యాఖ్యానించారు. విజయవాడ లో మీట్ దీ ప్రెస్ లో మాట్లాడిన ఆయన మహిళలు ఉద్యోగ, వ్యాపారాలు చేయరాదన్నది తన ఉద్దేశం కాదని, వేధింపులను, ఆకతాయిలను ధైర్యంగా ఎదుర్కవాలని అన్నారు. కేవలం చట్టాలు చేసినంత మాత్రాన అత్యాచారాలు, యువతుల అక్రమ రవాణా తదితరాలు ఆగవని, వాటిని ఎదుర్కొనే ధైర్యం మహిళల్లో పెరగాలని కోరారు. అందుకోసమే మూడు రోజుల పాటు జాతీయ మహిళా పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశామని అన్నారు. రాజకీయాల్లో భాగంగా గతంలో 12 గంటలు కష్టపడేవాడినని, ఇప్పుడు స్పీకర్ గా పెద్దగా పనిలేక, ఆలోచించి, మహిళా సాధికారతపై సమావేశాలు నిర్వహించాలని భావించి ఈ సదస్సును ఏర్పాటు చేశామని తెలిపారు. సదస్సుకు పలు దేశాల నుంచి 60 మందికి పైగా ప్రముఖులు హాజరు కానున్నారని వివరించారు.