తెరాస‌లో చేరిన వారికి చెప్పుల‌తో స‌న్మానం!

Sunday, June 9th, 2019, 12:20:08 PM IST

తెలంగాణ‌లో గులాబీ పార్టీకి ఎదురు లేద‌ని తెరాప నేత‌లు త‌లెగ‌రేస్తుంటే ఓ మ‌హిళ చెప్పుల‌తో కొట్టి స‌న్మానించ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో తెరాస విజ‌య విహారం చేసిన విష‌యం తెలిసిందే. స్థానిక సంస్థ‌ల్లో దాదాపుగా క్లీన్ స్వీప్ చేసి కాంగ్రెస్‌కు భారీ షాకిచ్చింది. ఇక ప్ర‌భావం చూపిస్తామ‌ని చెప్పిన బీజేపీ, టీడీపీ అడ్ర‌స్ లేకుండా పోయాయి. ఈ ఎన్నిక‌ల్లో గులాబీ పార్టీ అత్య‌ధికంగా జ‌డ్పీటీసీలు, ఎంపీ టీసీల‌తో పాటు అన్ని జ‌డ్పీ స్థానాల్ని సోంతం చేసుకుని రికార్డు సృష్టించింది.

అయితే ఈ పార్టీ ప్ర‌భంజ‌నానికి బెంబేలెత్తిపోయిన కాంగ్రెస్ వ‌ర్గాలు ఆ పార్టీని వీడి తెరాస గూటికి చేరాయి. వ‌రంగ‌ల్ రూర‌ల్‌ జిల్లా లోని న‌ర్సంపేట మండ‌లంలో కాంగ్రెస్ పార్టీ త‌రుపున గెలిచిన ఎంపీటీసీలు శ‌నివారం తెరాస‌లో చేరారు. ఇది జీర్ణించుకోలేని ఓ మ‌హిళకు ఎక్క‌డ లేని కోపం క‌ట్ట‌లు తెంచుకుంది. ఇంకేముంది స‌ద‌రు ఎంపీటీసీల‌కు త‌న కాలి చెప్పుల స‌న్మానం చేసింది. పోలీసులు చూస్తుండ‌గానే వారిపై తిర‌గ‌బ‌డి చెప్పుల‌తో చెడామ‌డా బాదేసింది. తిరిగి ఆమెపై దాడికి య‌త్నిస్తున్న స‌మ‌యంలో పోలీసులు జోక్యం చేసుకోవ‌డంతో ఆమె వారి దాడి నుంచి త‌ప్పించుకుని మ‌ళ్లీ చెప్పుల‌తో కొట్ట‌డం మొద‌లుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.