రివ్యూ రాజా తీన్‌మార్ : స్పైడర్ – మంచి సినిమానే కానీ మహేష్ చేయాల్సిన సినిమా కాదు !

Wednesday, September 27th, 2017, 06:37:25 PM IST


తెరపై కనిపించిన వారు : మహేష్ బాబు, ఎస్.జె. సూర్య, రకుల్ ప్రీత్ సింగ్

కెప్టెన్ ఆఫ్ ‘స్పైడర్’ : ఏ.ఆర్. మురుగదాస్

మూల కథ :

ఐబీ ఆఫీసులో ఫోన్ టాపింగ్ ఆఫీసర్ గా పనిచేసే శివ (మహేష్ బాబు) ప్రమాదం జరిగాక నేరస్తుల్ని పట్టుకునే బదులు ఆ ప్రమాదం జరగకుండా చూడాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తూ ఉంటాడు. అదే సమయంలో భైరవుడు (ఎస్.జె. సూర్య) అనే వ్యక్తి మానసిక స్థితి బాగోలేనందు వలన మృగంలా మారి జనాల్ని చంపుతూ శివ దృష్టిలో పడతాడు.

అలా తన దృష్టిలో పడ్డ భైరవుడ్ని శివ ఎలా డీల్ చేశాడు ? అసలు భైరవుడి మానసిక స్థితి ఎలాంటిది ? ఎందుకలా తయారైంది ? వరుసగా మనుషుల్ని ఎందుకు చంపుతుంటాడు ? చివరికి అతన్ని శివ ఎలా ఆపాడు ? అనేదే తెరపై నడిచే కథ..

విజిల్ పోడు :

⤏ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ మురుగదాస్ ఎంచుకున్న కథనం. ఒక వ్యక్తి ప్రమాదకరమైన మానసిక స్థితి వలన మృగంలా ఎలా మారుతాడు, మనుషుల్ని ఎలా చంపుతుంటాడు అనే పాయింట్స్ ని చాలా బాగా చూపించాడు. అంతేగాక ఫస్టాఫ్లో ప్రతి నాయకుడి నైపథ్యాన్ని కూడా ఆసక్తికరంగా చూపించారు. కనుక మొదటి విజిల్ మురుగదాస్ కి వేయొచ్చు.

⤏ విలన్ పాత్రలో ఎస్.జె. సూర్య నటన గొప్ప స్థాయిలో ఉంది. సినిమాకు అతనే ప్రధాన బలంగా నిలిచాడు. సినిమాలోని అతని సన్నివేశాల్ని చూస్తున్నంతసేపు కొత్తగా, ఆసక్తికరంగా ఉంటాయి. కనుక రెండో విజిల్ అతనికే వేయాలి.

⤏ ఇక మహేష్ బాబు ఎప్పుడూ చేసినట్టు ఒక రెగ్యులర్ స్టార్ హీరోలా కాకుండా కేవలం ఒక నటుడిగా, కథలో కీలకమైం పాత్రగా పెర్ఫార్మ్ చేసి మెప్పించాడు. కాబట్టి మూడో విజిల్ ఆయన చూపిన భిన్నత్వానికి వేసుకోవచ్చు.

ఢమ్మాల్ – డుమ్మీల్ :

⤏ సినిమా సెకండాఫ్ ఆరంభం బాగానే ఉన్నా పోను పోను చాలా బలహీనంగా తయారవుతుంది. దీంతో మొదటి భాగంలో దొరికినంత సంతృపీతి రెండవ భాగంలో దొరకదు.

⤏ అలాగే హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ చాలా బలహీనంగా ఉంటుంది. ఎక్కడా పెద్దగా రొమాంటిక్ ఫీల్ ను కలిగించదు. పైగా ఎక్కడా కామెడీ ఎంటర్టైన్మెంట్ అనేదే కనిపించదు.

⤏ మహేష్ ఒక నటుడిలా మాత్రమే చేసి భిన్నత్వాన్ని చాటుకున్న తెలుగు అభిమానులకు అది నిరుత్సాహకారంగానే అనిపిస్తుంది. పైగా దాని వలన సెకండాఫ్ లో తీవ్రత కూడా లోపించిపోయింది.

దేవుడా ఈ సిత్రాలు చూశారా..

⤏ పెద్ద సినిమా కావడం వలన అందరూ పెద్ద నటులు, టెక్నీషియన్స్ కావడం వలన ఎక్కడా ఆశ్చర్యకర అంశాలు కనిపించలేదు.

చివరగా సినిమా చూసిన ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు..

మిస్టర్ ఏ : ఎలా అనిపించింది సినిమా ?
మిస్టర్ బి : మంచి సినిమానే కానీ..
మిస్టర్ ఏ : కానీ ఏంటి ?
మిస్టర్ బి : మంచి సినిమానే కానీ మహేష్ చేయాల్సిన సినిమా కాదు !

  •  
  •  
  •  
  •  

Comments