అన్న‌గారినే బొమ్మ‌ను చేసి అమ్మేస్తున్నారు!?

Tuesday, June 11th, 2019, 08:57:40 PM IST

ప్ర‌పంచీక‌ర‌ణ‌లో ఇదో గొప్ప ట్రెండ్. ఎవ‌రు ఏ ఉత్ప‌త్తి అయినా ఎక్క‌డి నుంచైనా అమ్మేయొచ్చు.. మార్కెటింగ్ నైపుణ్యం కాస్త మెరుగ్గా ఉండాలి అంతే! అమెరికా నుంచి ఒకాయ‌న ద‌ర్గా (మ‌ణికొండ‌) ప్రైమ్ ఏరియాలో ఐదెక‌రాల‌ భూమిని మ‌ధ్య‌వ‌ర్తి సాయంతో కొన్నారు. అందుకోసం 300 కోట్లు చేతులు మారాయ‌న్న‌ మాట విని షాక్ తిన‌డం అవ‌త‌లివారి వంతు.

ఇక‌పోతే బాహుబలి సిరీస్ రిలీజైన‌ప్పుడు యానిమేష‌న్ బొమ్మ‌ల్ని గ్లోబ‌ల్ మార్కెట్లో అమ్మారు. ఆ సినిమాలో పాత్ర‌ల్ని బొమ్మ‌లుగా త‌యారు చేసి అమ్మకాలు సాగించారు. బిజినెస్ పెద్ద స‌క్సెసైంది. యానిమేష‌న్ సిరీస్ అంటూ అదో ర‌కం బిజినెస్ సాగించారు. ఇక‌పోతే సూప‌ర్ హీరోల సినిమాలు రిలీజైతే వాటికి సంబంధించిన పాత్ర‌లు- పాత్ర‌ధారుల బొమ్మ‌ల‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్లాది రూపాయ‌ల బిజినెస్ చేస్తుంటారు.

పైవ‌న్నీ ఒక ర‌కం అనుకుంటే ఇదిగో ఇదో కొత్త ట్రెండ్ అనే చెప్పాలి. అస‌లు అన్న‌గారు ఎన్టీఆర్ బొమ్మ‌లు అమ్మాల‌న్న గ‌డుగ్గాయ్ ఆలోచ‌న ఆ అభిమానికి ఇప్పుడే ఎందుకు వ‌చ్చిందో కానీ.. ఏకంగా న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముని ప్ర‌తిమ‌ల్ని త‌యారు చేయించి ఇదిగో ఇలా మార్కెట్లోకి తెచ్చేశాడు. షిరిడీ వెళితే బాబా బొమ్మ అయినా కొన‌రేమో కానీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎన్టీఆర్ అభిమానులు ఈ ప్ర‌తిమ‌ల్ని కొన‌కుండా ఉంటారా? వ‌ర‌ల్డ్ లోనే గొప్ప మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కం నాయ‌కుడు నంద‌మూరి తార‌క రామారావు. ప్లాస్ట‌ర్ ఆఫ్ ప్యారిస్ తో క్వాలిటీ క్లే తో త‌యారు చేసిన ఈ ప్ర‌తిమ ఎంతో నాణ్యంగా త‌ళ‌త‌ళ‌లాడుతూ క‌నిపిస్తోంది. పైగా దీనిని ఏకంగా మాజీ సీఎం చంద్ర‌బాబు చేతుల‌మీదుగానే లాంచ్ చేశారు. ఇటీవ‌ల‌ న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ బ‌ర్త్ డే సందర్భంగా ఈ ప్ర‌తిమ‌ల‌కు బోలెడంత ప్ర‌చారం చేసుకున్నారు. “ప్ర‌తి ఇంట్లో అన్న‌గారి రూపం – తెలుగు వారి ఆత్మ గౌర‌వం“ అనే నినాదంతో బాల‌య్య పుట్టిన‌రోజు సెంటిమెంటుతో బొమ్మ‌ల అమ్మ‌కం స్టార్ట‌య్యింది. రాత్రి పూట ప్ర‌త్యేకించి లైటింగ్ వ‌చ్చేలా రేడియంతో త‌యారు చేసిన బొమ్మ‌లు ఇవి అంటూ చాలానే బిజినెస్ టాక్టిస్ చూపిస్తున్నారు. వీటిని అమ్మే కంపెనీ పేరు మోక్ష‌జ్ఞ ఎంట‌ర్ ప్రైజెస్ అట‌. మొత్తానికి నంద‌మూరి కుటుంబ హీరోలంతా ఈ బిజినెస్ కి ప‌రోక్షంగా ఉప‌యోగ‌ప‌డుతుండ‌డం ఆస‌క్తిక‌రం.