టాలీవుడ్‌కి టాటా!? `సాహో` శ్ర‌ద్ధ డైరీ ఫుల్‌..

Tuesday, March 27th, 2018, 01:10:29 AM IST


ప్ర‌భాస్ స‌ర‌స‌న `సాహో` చిత్రంలో న‌టిస్తోంది శ్ర‌ద్ధాక‌పూర్‌. దాదాపు 250 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలున్నాయి. ఇలాంటి క్రేజీ సినిమాలో ల‌క్కీగాళ్‌ శ్ర‌ద్ధాక‌పూర్ క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకుంది. బాలీవుడ్ అందాల నాయిక శ్ర‌ద్ధాకి ఉత్త‌రాదిన ఉన్న క్రేజు దృష్ట్యా ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే `సాహో` త‌ర‌వాత శ్ర‌ద్ధా తెలుగులో న‌టిస్తుందా? న‌టించ‌దా? అని ప్ర‌శ్నిస్తే సందేహ‌మేన‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది.

శ్ర‌ద్ధా క‌పూర్ ఇప్ప‌టికే షాహిద్ క‌పూర్‌ స‌ర‌స‌న `బ‌ట్టి గుల్ మెహ‌ర్ చాలు` చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ క‌శ్మీర్, హృషికేష్ ప‌రిస‌రాల్లో సాగుతోంది. త‌దుప‌రి సైనా నెహ్వాల్ బ‌యోపిక్, స్త్రీ అనే రెండు సినిమాల్లో న‌టించేందుకు ప్రిప‌రేష‌న్‌లో ఉంది. ఈలోగానే కండ‌ల హీరో స‌ల్మాన్ స‌ర‌స‌న `భ‌ర‌త్‌` అనే చిత్రంలో అవ‌కాశం అందుకుంద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, శ్ర‌ద్ధా క‌పూర్‌ల‌ను ఫైన‌ల్ చేశార‌ని తెలుస్తోంది. వీటితో పాటు ప‌లు ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసేందుకు రెడీ అవుతోందిట‌. మొత్తానికి శ్ర‌ద్ధా కాల్షీట్లు చూస్తుంటే మ‌రో రెండుమూడేళ్లు ఫుల్ బిజీ అనే అర్థ‌మ‌వుతోంది. `సాహో` రిలీజైనా, త‌దుప‌రి వేరే సినిమాకి శ్ర‌ద్ధాని ఒప్పించాలంటే అక్క‌డ ఉన్న బిజీ దృష్ట్యా క‌ష్ట‌మే. పైగా ఈ భామ డిమాండ్ చేసే పే ప్యాకేజీ భారీగానే ఉంటోంది కాబ‌ట్టి మ‌న నిర్మాత‌లకు అది త‌ల‌కుమించిన భార‌మే అవుతుంది.