శ్రీదేవి హోటల్ గది సీజ్, మరణం పై పలురకాల ఊహాగానాలు?

Monday, February 26th, 2018, 05:21:36 PM IST


ప్రముఖ నటి శ్రీదేవి మరణానంతరం ఆమె మృతదేహం భారత్ తరలింపులో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో, సోషల్ మీడియాలో ఆమె మృతికి కారణమైన పరిస్థితులపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. శ్రీదేవి గుండెపోటు వల్లే మరణించారా లేక మరేదైనా ఇతర కారణం చేత మరణించారా అనే కోణంలో వస్తున్న కథనాలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు జుమేరా ఎమిరేట్స్‌ టవర్‌ హోటల్‌లో శ్రీదేవి బస చేసిన గదిని దుబాయ్‌ పోలీసులు సీజ్‌ చేశారని, ఆ సూట్‌ మొత్తాన్నీ ‘క్రూషియల్‌ స్పాట్‌’గా గుర్తించారన్న వార్తలు సైతం వెలువడుతున్నాయి. అయితే ఇందులో నిజమెంతో తెలియదుగాని
దీనిపై మాత్రం స్పందించేందుకు జ్యూమెరా హోటల్ యాజమాన్యం నిరాకరిస్తోందని పేర్కొంటూ కథనాలు వెలువడుతున్నాయి.

అయితే సాధారణ ప్రక్రియలో భాగంగానే పోలీసులు హోటల్ లో ఆమె బస చేసిన గదిని పరిశీలించినట్టు తెలుస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటల వరకు శ్రీదేవి మృతదేహం ముంబైకి చేరనున్నట్లు సమాచారం అందుతోంది. దుబాయ్‌ ప్రభుత్వ కఠిన నిబంధనల వల్లే మృతదేహం తరలింపులో ఆలస్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేటి మధ్యాహ్నం రెండు గంటలకల్లా ఆమె మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తున్నామని ఇండియన్‌ ఎంబసీ అధికారులు పేర్కొన్నట్లు అక్కడి ప్రముఖ పత్రిక ఖలీజ్‌ టైమ్స్ పేర్కొంది. కాగా, ముంబైలో ఆమె అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు బంధువులు పూర్తిచేశారు. ముంబై జుహూలోని శాంతా క్రజ్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు ఘనంగా నిర్వహించనున్నారు…