బాబును పొగిడిన వైకాపా నేత

Friday, October 17th, 2014, 03:15:40 PM IST

Srinivas-Reddy-ysr
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై బురద జల్లే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక తెలంగాణలో నానాటికి ముదురుతున్న విద్యుత్ సమస్యపై పొంగులేటి మాట్లాడుతూ ముందుచూపు ఉన్న నేతల్లో చంద్రబాబు ఒకరని, బాబు ముందు చూపును మెచ్చుకోవాల్సిందేనని కితాబిచ్చారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రికి చంద్రబాబు లాగ ముందుచూపు లేదని, ఆ కారణంగానే రాష్ట్రంలో విద్యుత్ కోతలు తారాస్థాయికి చేరుకున్నాయని పొంగులేటి తీవ్రంగా విమర్శించారు.

కాగా తెలంగాణలో విద్యుత్ కోతలకు నిరసనగా ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు బస్సు యాత్రలు, ఆందోళనలు చేస్తుంటే తాజాగా వైకాపా కూడా వీరితో గళం కలిపింది. అయితే ఎప్పుడు ఒకరిపై ఒకరు బురద జల్లుకునే ఈ మూడు పార్టీల నేతలు తెలంగాణలో విద్యుత్ సమస్యపై పోరాటంలో మాత్రం ఒకే తాటిపై నడుస్తున్నారు. కాగా ఆంద్రప్రదేశ్ లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైకపా నేత తెలంగాణలో మరో విపక్ష పార్టీ నేతను విమర్శించడానికి అధికార పక్షం నేతను పొగడడం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. మరి దీనికి ఆ పార్టీ అధ్యక్షుడు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే!