18 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇప్పుడే కాదు – తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్

Saturday, May 1st, 2021, 02:00:06 AM IST

కరోనా సెకండ్ వేవ్ ఉదృతంగా విస్తరిస్తున్న నేపధ్యంలో దేశ‌వ్యాప్తంగా 18 ఏళ్లు పైబ‌డిన‌ వారందరికి మే 1వ తేది అనగా నేటి నుంచి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల కొర‌త‌ ఉండడంతో ప‌లు రాష్ట్రాలు 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇప్పుడే ఇవ్వలేమని తేల్చి చెప్పేశాయి. అయితే తాజాగా దీనిపై తెలంగాణ ప్ర‌భుత్వం కూడా కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 45 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్ ఇవ్వడం ఇప్పుడే సాధ్యం కాదని నిన్న రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పిన సంగతి తెలిసిందే.

అయితే తెలంగాణ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీ‌నివాస్‌రావు కూడా దీనిపై క్లారిటీ ఇచ్చారు. నేటి నుంచి ప్రారంభం కావాల్సిన వ్యాక్సినేష‌న్ డ్రైవ్‌ను ర‌ద్దు చేసిన‌ట్టు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తగిన‌న్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో లేక‌పోవ‌డం, ఇంకా రాష్ట్రానికి డోసులు రాక‌పోవ‌డంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలిపారు. ఇక‌పోతే ప్రైవేట్ ఆస్ప‌త్రుల‌కు వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రాను కూడా ప్ర‌భుత్వం రద్దు చేసిందని పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ నిల్వలు ఉన్నప్పుడు 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తామని డీహెచ్ శ్రీ‌నివాస్‌రావు తెలిపారు.