సీఎం కారు వస్తుందని పక్కకు తప్పుకున్న ప్రతిపక్ష నేత

Saturday, January 28th, 2017, 05:15:50 PM IST

stalin-and-panner-selvam
జయలలిత బ్రతికి ఉన్నపుడు అన్నాడీఎంకే, డీఎంకే నేతలు ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకునే వారు. ఏ రాష్ట్రంలోనూ చూడనటువంటి శత్రుత్వం ఆ రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కనిపించేది. అయితే ఇప్పుడు ఆ కోపాలు తగ్గుముఖం పట్టినట్టుగా అనిపిస్తుంది. నిన్న చెన్నైలో జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ఇద్దరూ ఒకరికొకరు ఇచ్చుకున్న మర్యాద చూసి అందరు ఔరా అనుకున్నారు.

ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ శుక్రవారం ఉదయం తన స్వగృహం నుండి కాన్వాయ్ లో సచివాలయానికి బయలుదేరారు. మెరీనా బీచ్ లోని కామరాజన్ రోడ్డు వద్దకు చేరుకోగానే…. దూరంగా పన్నీర్ సెల్వం కాన్వాయ్ వస్తుండడాన్ని స్టాలిన్ గమనించారు. వెంటనే తన కారుకు ముందు, వెనుక వస్తున్న పోలీస్ వాహనాలను నెమ్మదిగా నడపాలని, ముఖ్యమంత్రి కాన్వాయ్ కు దారి ఇవ్వాలని సూచించారు. అదే సమయంలో ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తనకంటే ముందు స్టాలిన్ కాన్వాయ్ వెళ్లడం చూసి తన కాన్వాయ్ లోని వాహనాలను నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. సీఎం కాన్వాయ్ నెమ్మదించడంతో ఆశ్చర్యపోయిన స్టాలిన్ తన కాన్వాయ్ ను రోడ్డు పక్కగా నిలిపివేశారు. స్టాలిన్ కాన్వాయ్ ఆగడం గమనించిన సీఎం తనకు దారి ఇచ్చేందుకే స్టాలిన్ ఆలా చేశారని గ్రహించి తన కాన్వాయ్ ను వేగంగా వెళ్లాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్, ప్రతిపక్ష నేత స్టాలిన్ ఒకరినొకరు గౌరవించుకోవడాన్ని ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు.