వ్వాటే ట్రైల‌ర్ : సింగంలా విరుచుకుప‌డిన శిక్కు వీరుడు?

Thursday, January 25th, 2018, 03:00:43 PM IST

భార‌త భూభాగంలోకి చొచ్చుకొచ్చే శ‌త్రుసైన్యం నుంచి మ‌నల్ని కాపాడాలంటే అందుకు ఎంతో ధీర‌త్వం ఉన్న సైన్యం అవ‌స‌రం. మంచులో గ‌డ్డ క‌ట్టే చోట నిరంత‌రం గ‌స్తీ కాసే సైన్యానికి ఎన్నో స‌వాళ్లు ఎదుర‌వుతుంటాయి. శ‌త్రువు ఓవైపు, వాతావ‌ర‌ణం మ‌రోవైపు పెనుస‌వాళ్లు విసురుతుంటాయి. అలాంటి స‌న్నివేశంలోనూ రేయింబ‌వ‌ళ్లు నిదుర అన్న‌దే లేకుండా మ‌న కోసం త‌మ జీవితాల్ని ప‌ణంగా పెట్టి పోరాడుతుంటారు. ఇక ఇండియా – పాక్ బార్డ‌ర్ మాట అటుంచితే, ఇండియా – చైనా బార్డ‌ర్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది. అక్క‌డ కాప‌లా కాయాలంటే ఎన్నో స‌వాళ్లు ఎదుర్కోవాల్సిందే. అయితే అలాంటి చోట అనూహ్యంగా భార‌త భూభాగంలోకి చొచ్చుకు వ‌చ్చిన చైనా సైన్యాన్ని.. కేవ‌లం 21 మంది బెటాలియ‌న్‌తో ఎదుర్కొని విరోచితంగా పోరాడాడు మ‌నవాడైన‌ శిక్కు సైనికుడు సుబేదార్ జోగీంద‌ర్ సింగ్‌. శ‌త్రువు గుండెల్ని చీల్చి చెండాడిన చండ‌శాస‌నుడిగా అత‌డి పేరు అప్ప‌ట్లో మార్మోగిపోయింది.

ప‌రిమిత బ‌ల‌గాల‌తో చైనీయుల్ని ఊచ‌కోత కోసిన గ్రేట్ వీరుడు అత‌డు. ఇప్పుడు అత‌డిపై సినిమా తెర‌కెక్కుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ని లాంచ్ చేశారు. “ఫ‌ర్ యువ‌ర్ కైండ్ ఆఫ్ ఇన్ఫ‌ర్మేష‌న్‌.. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు ఇండియా“ సుబేదార్ వినిపించిన డైలాగ్ గుండెల్లో ప్ర‌తి ఒక్క భార‌తీయుడి గుండెల్లో మార్మోగుతోంది. ఈ ఒక్క డైలాగ్‌తో ఈ సినిమా ఏ త‌ర‌హానో అర్థ‌మైపోయింది. బార్డ‌ర్ వార్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌. `సుబేదార్‌ జోగీంద‌ర్ సింగ్` అనేది టైటిల్‌. 1962లో జ‌రిగిన రియ‌లిస్టిక్ సంఘ‌ట‌న‌ల‌తో తెర‌కెక్కిన చిత్ర‌మిది. ప‌ర‌మ్‌వీర చ‌క్ర సుబేదార్‌ జోగీంద‌ర్ సింగ్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కింది. 14000 అడుగులు ఎత్తున హిమాల‌యాల్లో ఈ సినిమాని తెర‌కెక్కించ‌డం ఓ హైలైట్ అయితే, కార్గిల్‌, డ్రాస్ సెక్టార్‌, రాజ‌స్థాన్‌, అస్సామ్ లో చిత్రీక‌ర‌ణ సాగిందిట‌. గిప్పి గ్రేవాల్‌, గుగ్గు గిల్‌, కుల్వింద‌ర్ బిల్లా, అదితి శ‌ర్మ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమా ఏప్రిల్ తొలివారంలో రిలీజ్ కానుంది. వార్ నేప‌థ్యంలో.. దేశ‌భ‌క్తి బ్యాక్‌డ్రాప్‌తో వ‌స్తున్న ఈ సినిమా సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయం.