అక్కినేని వారి అబ్బాయితో సుకుమార్?

Wednesday, April 4th, 2018, 07:53:34 PM IST


వెరైటీ చిత్రాల డైరెక్టర్ సుకుమార్ లేటెస్ట్ సెన్సేషన్ రంగస్థలం. రంగస్థలం అద్భుత విజయంతో ప్రస్తుతం ఈ దర్శకుడి పేరు టాలీవుడ్ లో మారు మ్రోగుతోంది. ఒకప్పుడు ఆర్య సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సుకుమార్ ఆ తర్వాత చేసిన జగడం, ఆర్య 2, 1 నేనొక్కడినే సినిమాలు నిరాశపరిచాయి. అయితే 100% లవ్, నాన్నకు ప్రేమతో ఆయనకు మంచి విజయాన్ని అందించాయి. మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ కు ఇంత పెద్ద విజయం అందించిన సుకుమార్ ప్రస్తుతం అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ తో ఓ చిత్రం చేయనున్నట్లు వినికిడి. అయితే ఈ మేరకు వీరిద్దరు ఒకసారి కలిసారని, ఆ సమయం లో వారిద్దరి మధ్య కథాచర్చలు కూడా జరిగినట్లు సమాచారం.

ఈ విషయం అధికారికంగా బయటకు రానప్పటికీ ప్రస్తుతం అఖిల్ తొలిప్రేమ దర్శకులు వెంకీ అట్లూరి తో చేస్తున్న సినిమా తర్వాత ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అయితే ఇప్పటికే అఖిల్ అన్నయ్య నాగచైతన్యకి 100% లవ్ సినిమాతో మంచి విజయాన్ని అందించిన సుకుమార్ మరి తమ్ముడికి ఎటువంటి సినిమా ఇస్తాడో చూడాలి….