రేప‌ల్లె సీటు.. న‌టుడు సుమ‌న్‌కి!?

Sunday, September 23rd, 2018, 07:29:59 PM IST

చిరంజీవి, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, రోజా, శివాజీ వంటి సెల‌బ్రిటీలు రాజ‌కీయాల్లో స్పీడ్ పెంచిన సంగ‌తి తెలిసిందే. అయితే వీళ్ల‌లో చిరంజీవికి స‌మ‌కాలికుడైన స్టార్ హీరోగా సుమ‌న్ పేరు అప్ప‌ట్లో వినిపించేది. ఆ క్ర‌మంలోనే చిరు గ్రాఫ్ పైకి వెళితే, క్ర‌మ‌శిక్ష‌ణా రాహిత్యం వ‌ల్ల సుమ‌న్ గ్రాఫ్ కిందికి వెళ్లిపోయింద‌ని చెప్పుకున్నారు. అయినా కాల‌క్ర‌మంలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానూ సుమ‌న్ ఇటు తెలుగు, అటు త‌మిళ్ రెండుచోట్లా రాణించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు.

ప్ర‌స్తుతం సుమ‌న్ రాజ‌కీయాల్లో జోరు పెంచ‌డంపై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. 2019 ఎన్నిక‌లే ల‌క్ష్యంగా అత‌డు ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నాడు. ఏపీ రాజ‌కీయాల్లో అత‌డు భాగం కావాల‌నుకుంటున్నాడు. అయితే ఇందుకోసం చాలా ముందు నుంచే సుమ‌న్ గ్రౌండ్ వ‌ర్క్ చేయ‌డంపై ఏపీ పొలిటిక‌ల్ కారిడార్‌లో ఆస‌క్తిక‌రంగా చ‌ర్చ సాగుతోంది. గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ మీడియాలో క‌నిపిస్తూనే ఉన్నాడు సుమ‌న్. అత‌డు క‌నిపించిన ప్ర‌తిసారీ ప్ర‌జా సేవ గురించి, సామాజిక సేవ గురించి మాట్లాడుతుంటే చాలానే సందేహాలొచ్చాయి. ఆక్ర‌మంలోనే ఇటీవ‌ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ని అత‌డు విమ‌ర్శించ‌డం చ‌ర్చ‌కొచ్చింది. సుమ‌న్ దృష్టి గుంటూరు- రేప‌ల్లె సీటుపై ఉంది.

తేదేపా నుంచి పోటీ చేయాల‌న్న‌ది అత‌డి ఆశ‌. అందుకు గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఈడె మురళీ కృష్ణ సుమన్ అభిమాని కావ‌డంతో అట్నుంచి న‌రుక్కొస్తున్నాడ‌ట‌. చంద్రబాబు తమ అభిమాన నేత అంటూ సుమ‌న్ ప్ర‌స్థావించ‌డం వెన‌క కార‌ణం కూడా రేప‌ల్లె సీటు ఆశించేన‌ట‌. రేప‌ల్లె నుంచి మూడుసార్లు గెలిచిన మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌ను గ‌త ఎన్నిక‌ల్లో స‌త్య‌ప్ర‌సాద్ ఓడించాడు. అయితే అత‌డికి నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త నెల‌కొంద‌ని, అందువ‌ల్ల ఇక్క‌డ సుమ‌న్ తేదేపా సీటుకి ఎస‌రు పెట్టే ప‌నిలో ఉన్నాడ‌ని ప్ర‌చారం సాగుతోంది. దీంతో స‌త్య‌ప్ర‌సాద్‌లో ఆందోళ‌న మొద‌లైందిట‌. రేప‌ల్లెలో కుల‌స‌మీక‌ర‌ణాలు చూస్తే అక్క‌డ గౌడ‌-మ‌త్స్య‌కార క‌మ్యూనిటీనే ఎక్కువ‌. స‌త్య‌ప్ర‌సాద్ -గౌడ‌. అత‌డిపై మ‌త్స్య‌కార వ‌ర్గం నుంచి వ‌చ్చిన‌ మోపిదేవి వైకాపా త‌ర‌పున బ‌రిలో ఉన్నారు. సుమ‌న్ రాక‌తో స‌త్య‌ప్ర‌సాద్‌కి దిగులు మొద‌లైంద‌ని చెబుతున్నారు. ఇక సుమ‌న్ ఇక్క‌డి నుంచి పోటీ చేయాల‌ని తేదేపా రేప‌ల్లె కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేస్తుండ‌డంతో ఇక్క‌డ రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింద‌ని చెబుతున్నారు. ఇంత‌కీ బాబు సుమ‌న్ కి సీటిస్తారా.. లేదా? అన్న‌ది తేలాల్సి ఉంది.