ప్రీమియర్ షోలతో సునామి సృష్టించనున్న సూపర్ స్టార్!

Wednesday, April 18th, 2018, 08:35:26 PM IST


అందగాడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో, డివివి దానయ్య నిర్మించిన కొత్త సినిమా ‘భరత్‌ అనే నేను’. ఎల్లుండి విడుదల కానున్న ఈ సినిమా కలెక్షన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలను ఫిబ్రవరి 19న అత్యంత భారీ స్థాయిలో ప్రదర్శించనున్నారు. మొత్తం 2000 ప్రీమియర్‌ షోలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా బాక్సాఫీసు వద్ద సూపర్ స్టార్ మహేష్ సునామీ సృష్టించబోతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మాములుగా ఇక్కడ నెగటివ్ టాక్ వచ్చిన మహేష్ సినిమాలు కూడా అమెరికాలో అద్భుత విజయం అందుకున్నాయి. ఈ మేరకు ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. మహేశ్‌బాబు సినిమా ప్రీమియర్‌ స్క్రీనింగ్స్‌లో మైండ్‌బ్లోయింగ్‌ వసూళ్లు సాధించేలా ఉందని పేర్కొన్నారు.

సినిమా కొత్త రికార్డు సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. అమెరికాలో మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను విడుదలచేయనున్నట్లు తెలుస్తోంది. తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమా తర్వాత అమెరికాలో భారీ వసూళ్లు సాధించిన రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘రంగస్థలం’ సినిమాల రికార్డును ‘భరత్‌’ బద్దలు కొట్టడం ఖాయంగానే కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందించిన ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.

బాలీవుడ్‌ నటి కైరా అద్వాని ఈ సినిమాతో టాలీవుడ్ కి కథానాయికగా పరిచయం అవుతోంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ లకు కూడా మంచి స్పందన లభించింది. అదీకాక యూనిట్ మొత్తం కూడా సినిమాపై గట్టి నమ్మకంతో వుంది. ఇటీవల మీడియాతో నిర్మాత దానయ్య మాట్లాడుతూ మా బ్యానర్ లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అద్భుత విజయం సాధిస్తుందని చెప్పకనే చెప్పారు కూడా. ‘శ్రీమంతుడు’ వంటి ఇండస్ట్రీ హిట్‌ తర్వాత మహేశ్‌, కొరటాల కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. చూడాలిమరి భరత్ విడుదల తర్వాత ఎన్ని రికార్డులు బద్దలు కొడతాడో……

  •  
  •  
  •  
  •  

Comments