సూప‌ర్‌స్టార్ ద‌శాబ్ధాల ప‌య‌నం

Thursday, May 31st, 2018, 01:46:30 PM IST

సూప‌ర్‌స్టార్ కృష్ణ వ‌య‌సు 76. ఇప్ప‌టికీ ఆయ‌న ఎంతో ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారంటే అది నిజంగా స్వీయ క్ర‌మ‌శిక్ష‌ణ‌కు సంబంధించిన విష‌యం అనే చెప్పాలి. గొప్ప‌ క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబ‌ద్ధ‌త‌, ఆరోగ్యం ప‌ట్ల శ్ర‌ద్ధ ఉన్న క‌థానాయ‌కుడు కాబ‌ట్టే ఇన్నేళ్లుగా ఆయ‌న ఇంకా హ్యాండ్స‌మ్ బోయ్‌గానే అభిమానుల‌కు క‌నిపిస్తున్నాడు. అంతేకాదు కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు మూడు షిప్టుల డ్యూటీని ఎలాంటి అల‌స‌ట లేకుండా పూర్తి చేసేవారు. క్ష‌ణం తీరిక లేకుండా అంత బిజీగా షూటింగుల్లో పాల్గొన్న హీరో వేరొక‌రు లేర‌నే చెబుతారంతా.

నేటిత‌రం సూప‌ర్‌స్టార్ నుంచి స్ఫూర్తి పొందేది ఈ క్ర‌మ‌శిక్ష‌ణ విష‌యంలోనే. ఇక టాలీవుడ్ అగ్ర‌క‌థానాయ‌కుడిగా వెలిగిపోతున్న మ‌హేష్ సైతం త‌న తండ్రి నుంచి స్ఫూర్తి పొందుతాన‌ని ప‌లుమార్లు తెలిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, వృత్తిగ‌త నిబ‌ద్ధ‌త‌ను ఆయ‌న నుంచే నేర్చుకున్నాన‌ని అన్నారు. కృష్ణ అంత స్పీడ్‌గా సినిమాలు చేయ‌క‌పోయినా.. చేసే ప‌నిని చిత్త‌శుద్ధితో చేయ‌డం మ‌హేష్ అల‌వాటు. అందుకే మ‌హేష్ తో ప‌ని చేసిన నిర్మాత‌లు త‌న‌ని అభిమానిస్తారు. నేడు సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన‌రోజు వేడుక‌ల సంద‌ర్భంగా హైద‌రాబాద్ నాన‌క్‌రామ్‌గూడ‌లోని కృష్ణ ఇంటి ప‌రిస‌రాల్లో పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. సాయంత్రం ప్ర‌త్యేకించి మీడియా మీట్‌ని ఏర్పాటు చేశారు. ఘ‌ట్ట‌మ‌నేని ఫ్యామిలీ అంతా ప్ర‌స్తుతం ఈ ఉత్స‌వాల్లో సంద‌డిగా ఉంది. ద‌శాబ్ధాల పాటు తిరుగులేని ఆరోగ్యంతో ఇప్ప‌టికీ న‌వ‌య‌వ్వ‌నుడిగా ఉన్న సూప‌ర్‌స్టార్‌కి ప్ర‌త్యేకించి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు.