సూపర్ స్టార్, యంగ్ టైగర్ ఒక్కటైనవేళ!

Tuesday, April 3rd, 2018, 05:04:52 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రముఖ దర్శకులు కొరటాల శివ దర్శకత్వంలో బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ తొలిసారి టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమవుతూ నటిస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా విజన్ అఫ్ భరత్, సాంగ్ అఫ్ భరత్, అలానే మొన్న విడుదలయిన ఐ డోంట్ నో సాంగ్ యూట్యూబ్ లో సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

బ్రహ్మోత్సవం, స్పైడర్ సినిమాల పరాజయాలతో కాస్త డీలాపడ్డ సూపర్ స్టార్, ఈ సినిమాతో ఎలా అయినా తన ఫాన్స్ కి సూపర్ హిట్ ఇవ్వాలనే తపనతో కష్టపడుతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా ఆడియో విడుదల వేడుకను ఈ నెల 7వ తేదీన, భరత్ బహిరంగ సభ పేరుతో హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు కూడా మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు వస్తున్నారని ఫిలిం నగర్ లో ప్రచారం జోరుగా సాగుతోంది.

కాగా ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం ఈ వేడుకకు హాజరవుతున్నారని వినికిడి. మరి రాంచరణ్ పరిస్థితి ఇంకా నిర్ణయం కాలేదని అంటున్నారు. అయితే ఈ వార్త భారత్ అనే నేను యూనిట్ కాన్ఫర్మ్ చేయవలసి వుంది. ఒకవేళ ఇది నిజమైతే ఒకే వేదికపై అటు సూపర్ స్టార్ ను ఇటు యంగ్ టైగర్ ను చూసిన ఫాన్స్ ఆనందానికిఅవధులు ఉండవనే చెప్పాలి…..