గిన్నిస్ రికార్డ్ దిశగా స్వరవీణాపాణి.. తెలుగు జాతి గర్వించబోతుందిగా..!

Wednesday, October 2nd, 2019, 06:34:47 PM IST

సంగీతం ఈ పేరులోనే ఏదో తెలియని ప్రశాంతత, సప్త రాగాలతో సప్త లోకాలను సైతం ఏకం చేసే ఘనత ఒక్క సంగీతానికే దక్కుతుందని చెప్పాలి. సంగీతమనేది ఎన్ని రకాలుగా ఉన్న అందులో స్వరవీణాపాణిగా పేరుపొందిన వోగేటి నాగ వెంకట రమణ మూర్తిగారి అందించే సంగీతానికి ఒక ప్రత్యేకత గుర్తింపు ఉందనే చెప్పాలి. పట్టుకోండి చూద్దాం, మిథునం, దేవస్థానం వంటి ఎన్నో విజయవంతమైన తెలుగు సినిమాలకు సంగీత దర్శకుడిగా పనిచేసి సంగీత ప్రేమికుల మనసులో చెరిగిపోని ముద్రను వేసుకున్న ఈయన మరో సాహోసోపేతానికి పూనుకున్నాడు.

యునైటెడ్ కింగ్‌డం తెలుగు అసోసియేషన్, అమెరికాకు చెందిన వెన్నం ఫౌండేషన్, భారత దేశానికి చెందిన స్వరనిధి సంస్థల వారి ఆధ్వర్యంలో లండన్ లోని హ్యామర్ స్మిత్లోని ద భవన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలలో లాంగెస్ట్ మారథాన్ చర్చ్ ఆర్గాన్ ప్లేయింగ్ అనే అంశంతో, సుదీర్ఘమైన సంగీతాలాపనతో 72 మేళకర్త రాగాలను తన సంగీత సాధనంపై వాయిస్తూ తెలుగువారి సంగీత వైభవాన్ని, భారత జాతి కీర్తిని ప్రపంచ నలుదిశలా వ్యాప్తి చెందించాలని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధనకై తెలుగు బిడ్డ వోగేటి నాగ వెంకట రమణ మూర్తిగారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. అయితే నిన్న యూకే కాలమానం ప్రకారం ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్కడి కాలమానం ప్రకారం గాంధీ జయంతి రోజున రాత్రి పది గంటల ప్రాంతంలో ముగుస్తుంది. దాదాపు 64 గంటల పాటు సాగే ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ చరిత్రలో నిలిచిపోవాలని, గాంధీ జయంతికి ఈ రికార్డ్ అంకితం అవ్వాలని తెలుగువారమందరం మనస్పూర్తిగా కోరుకుందాం.