కొత్త పించన్లపై టీ-సర్కార్ క్లారిటీ

Sunday, September 14th, 2014, 01:20:59 PM IST


తెలంగాణ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా…పంచాయితీ రాజ్, ఐటీ శాఖ రూపొందించిన బ్రోచర్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీ రాజ్ పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలోని చెరువులు, కుంటలు, గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణకు, మరమ్మతులకు… మైనర్ ఇరిగేషన్ ద్వారా ప్రతి ఏటా 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్..

గత ప్రభుత్వాలకు భిన్నంగా.. వృద్ధులకు, వింతంతువులకు, వికలాంగులకు నవంబర్ మొదటి వారం నుంచి పెంచిన కొత్త పింఛన్లు అందిస్తామన్నారు. ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి స్పష్టం చేశారు. మరోవైపు సమగ్ర సర్వే కంప్యూటరీకరణ దాదాపు పూర్తయ్యింది. మరో 10 లక్షల మంది వివరాలను కంప్యూటరీకరణ చేయాల్సి ఉందని.. ఇది మరో ఐదు రోజుల్లో పూర్తి అవుతుందని కేటీఆర్ అన్నారు. గ్రామీణ రోడ్లను ఐఆర్సీ స్టాండర్డ్స్ ప్రకారం నిర్మిస్తామన్నారయాన. 2015 ఆగస్టు నాటికి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మానాన్ని పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ నేతలు, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యాలను మంత్రి కేటీఆర్ తిప్పికొట్టారు. తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేసేముందు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. రాష్ట్ర, హైదరాబాద్ పరువును మంటగలిపిందేవరో అందరికి తెలుసు అన్నారు. అవినీతి కేసులు మంత్రులు, ఐఏఎస్ అధికారులు సైతం జైలు పాలైయ్యారనే విషయాన్ని ప్రస్తావించారు కేటీఆర్. టీ-పీసీసీ చీఫ్ ఇప్పటికీ అవినీతి విషయంలో సీబీఐ కేసును ఎదుర్కొంటున్నారని కేటీఆర్ విమర్శించారు.

రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం.. అన్ని అంశాల్లో సమగ్ర అభివృద్ధిని కోరుకుటుందని మంత్రి కేటీఆర్ ఆశా భావం వ్యక్తం చేశారు.