చిత్ర‌పురిలో ఫిలింజ‌ర్న‌లిస్టుల‌కు డ‌బుల్ బెడ్‌రూమ్స్‌- త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌

Wednesday, February 8th, 2017, 07:03:49 PM IST


సినిమా 24 శాఖ‌ల‌తో పాటు.. సినిమా జ‌ర్న‌లిజంని 25వ‌ శాఖ‌గా అభివ‌ర్ణిస్తుంటారు. అయితే అలాంటి సినిమా జ‌ర్న‌లిస్టుల ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉంటుందో బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసింది త‌క్కువే. జ‌ర్న‌లిస్టు క‌మ్యూనిటీలో సినిమా జ‌ర్న‌లిస్టుల ప్ర‌యారిటీ అంతంత మాత్రం కావ‌డంతో క‌నీస‌మాత్రంగా హెల్త్ కార్డులు, అక్రిడిటేష‌న్ల విష‌యంలో అన్యాయం జ‌రుగుతూనే ఉంటుంది. బ‌త‌క‌డానికి అవ‌స‌రాలైన క‌నీస కూడు, గూడు, గుడ్డ సైతం క‌రువే. అయితే సినిమా జ‌ర్న‌లిస్టుల క‌నీస అవ‌స‌రాల్ని తీర్చ‌డం కోసం తామున్నామ‌న్న భ‌రోసానిస్తున్నారు తెలంగాణ సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్‌. సినిమా జ‌ర్న‌లిస్టుల స‌మ‌స్య‌లేంటి? అన్న‌వి తెలియ‌జేస్తే, వారి క‌నీస‌ అవ‌స‌రాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం ఎల్ల‌పుడూ సాయానికి ముందుంటుంద‌ని ప్ర‌క‌టించారు.

ఫిలిం జ‌ర్న‌లిస్టులంద‌రికీ అక్రిడిటేష‌న్లు, హెల్త్ కార్డుల‌తో పాటు డ‌బుల్ బెడ్‌రూం ఇళ్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని త‌ల‌సాని ప్రామిస్ చేశారు. నేటి ఉద‌యం హైద‌రాబాద్ ఫిలింఛాంబ‌ర్‌లో తెలుగు ఫిలింజ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ (టిఎఫ్‌జెఎ)-2017 డైరీని ఆవిష్క‌రించిన అనంత‌రం త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ సినిమా జర్న‌లిస్టుల సంక్షేమంపై ముచ్చ‌టిస్తూ పైవిధంగా స్పందించారు. జ‌ర్న‌లిస్టులు అడిగిన ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా.. సినిమా జ‌ర్న‌లిస్టుల క‌మ్యూనిటీకి డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు ప్ర‌భుత్వం సంసిద్ధంగా ఉంది. గ‌చ్చిబౌళి -కాజ‌గూడ ప‌రిస‌రాల్లో ఉన్న చిత్ర‌పురి కాల‌నీలో సినిమా జ‌ర్న‌లిస్టుల‌కు డ‌బుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించే అవ‌కాశాల్ని ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తుంద‌ని త‌ల‌సాని ఈ సంద‌ర్భంగా అన్నారు. ఆరోగ్య‌శ్రీ‌, క‌ళ్యాణ‌ల‌క్ష్మి వంటి ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని సినిమా జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు వ‌ర్తింప జేస్తున్నామ‌ని, ఆప‌త్కాలంలో జ‌ర్న‌లిస్టుల‌ను ఆదుకునేందుకు వ్య‌క్తిగ‌తంగా సాయ‌ప‌డ‌తాన‌ని త‌ల‌సాని ఈ సంద‌ర్భంగా ప్రామిస్ చేశారు. డైరీ ఆవిష్క‌ర‌ణ‌లో ఫిలింజ‌ర్న‌లిస్ట్స్ అసోసియేష‌న్ అధ్య‌క్షులు కె.రామ నారాయ‌ణ‌రాజు, గౌర‌వాధ్య‌క్షులు బి.ఎ.రాజు, స‌ల‌హాదారులు ప‌సుపులేటి రామారావు, సురేష్ కొండేటి, జేపీ, ఉపాధ్య‌క్షులు ర‌ఘు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌త్యం, జాయింట్ సెక్ర‌ట‌రీ సి.హెచ్‌.ర‌మేష్‌, ట్రెజ‌ర‌ర్ స‌తీష్‌, ఆర్గ‌నైజింగ్ సెక్ర‌ట‌రీ దెయ్యాల అశోక్‌, ఇత‌ర‌ స‌భ్యులు కొంతం శివాజీ ప్ర‌సాద్‌, కొంతం శ్రీ‌కాంత్, వీర‌బాబు, ఆర్‌కె, సురేష్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.