ఒక్క ట్వీట్ చేసి తమిలనాట కలకలం రేపిన అమిత్ షా

Sunday, September 15th, 2019, 03:08:10 PM IST

దక్షిణాది రాష్ట్రాలు ఎన్నో దశాబ్దాల నుండి కేంద్ర ప్రభుత్వాల పెత్తనాన్ని ఒప్పుకోని సంగతి తెలిసిందే. ఏపీలో అయినా కేంద్ర ప్రభుత్వాలకు కొంచమైనా వెసులుబాటు ఉంటుందేమో కానీ తమిళనాడులో మాత్రం ఏమాత్రం సానుకూలత ఉండదు. పైగా తమిలనాడులో భాషాభిమానం కూడా ఎక్కువ. అందుకే హిందీ భాషను వ్యాప్తి చేయాలనే భాజాపా ప్రయత్నాలకు అక్కడే అడ్డుకట్టపడుతోంది.

ఎన్నికల ప్రచారంలో దేశం మొత్తం హిందీలో ప్రసంగించిన మోడీ, అమిత్ షాలు తమిలనాడులో మాత్రం ఆంగ్లంలో మాట్లాడారంటే అక్కడి ప్రజలు పరభాషను తమపై రుద్దడాన్ని అంతలా వ్యతిరేకిస్తారు. అందుకే ఒకే దేశం.. ఒకే భాష.. హిందీ ఏకైక భాషగా ఉంటే దేశం అభివృద్ది చెందుతుంది అంటూ అమిత్ షా మాట్లాడిన మాటల్ని తమిళులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

తమిళనాట ఉండే రాజకీయ పార్టీలన్నీ హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దాలని చూస్తే సహించేది లేదని, ఇది హిందూ దేశమా లేకపోతే హిందీ దేశమా అంటూ మండిపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భవిష్యత్తులో మోడీ, అమిత్ షా ఎప్పుడు తమిళనాడు వచ్చినా ఈ వ్యతిరేకత వారిని తాకడం ఖాయం.