ఆయన దివాకర్ కాదు ‘ది..వాకర్’ట!

Tuesday, September 23rd, 2014, 10:32:24 AM IST


తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఇటీల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతూ వైకాపా త్వరలో మూత పడబోతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఆరోపణలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం తీవ్రంగా ఖండించారు. తమ్మినేని మాట్లాడుతూ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకార పూరిత వైఖరికి నిదర్శనమని విరుచుకుపడ్డారు. అలాగే సూర్య చంద్రులు ఉన్నంత కాలం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వైకాపా పార్టీ అజరామరంగా ఉంటుందని తమ్మినేని పేర్కొన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ జేసీ చాలా ఎక్కువ మాట్లాడుతున్నారని, అసలు ఆయనకు ఉన్న విశ్వసనీయత ఏమిటని సూటిగా ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ నుండి బయటపడిన దివాకర్ తర్వాత ఏ పార్టీలో చేరాలో తెలియక అన్ని పార్టీల చుట్టూ తిరుగుతూ ‘ది..వాకర్’ అని పేరును సార్ధకం చేసుకున్నారని తమ్మినేని ఎద్దేవా చేశారు. ఇక ‘టిడిపిని జేసీ క్లోజ్ చేస్తారో.. టిడిపినే జేసీని క్లోజ్ చేస్తుందో ముందుగా తేల్చుకోవాలని’ తమ్మినేని సీతారాం విమర్శించారు.