ఏపీ సర్కార్‌పై కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసిన టీడీపీ..!

Wednesday, September 18th, 2019, 01:13:35 AM IST

టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ నిన్న చనిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం వరుస కేసులతో కోడెలను బాగా టార్గెట్ చేస్తూ వస్తుంది. అయితే ఈ కేసుల విషయంలో మానసికంగా బాగా కుంగిపోయిన కోడెల నిన్న తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న విషయం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో పెద్ద చర్చానీయాంశంగా మారింది.

అయితే కోడెల ఆత్మహత్యపై స్పందించిన టీడీపీ నేతలు వైసీపీ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. అంతేకాదు వైసీపీ అధికారంలోకి వచ్చిన వందరోజులలోనే వందలాది మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని, ఇప్పుడు కోడెల అంతటి మనిషే బలవన్మరణానికి పాల్పడి చనిపోయారంటే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో పెద్దగా చెప్పనవసరం లేదని అంటున్నారు. అయితే పోలీసులు కూడా ప్రభుత్వం చెప్పినట్టే నడుచుకుంటున్నారని పోలీసుల తీరుపై, రాష్ట్ర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి టీడీపీ నేతలు ఫిర్యాదు అందించారు. అయితే ఈ ఫిర్యాదుపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వంపై తమకు ఫిర్యాదులు అందాయని, పోలీసులు పూర్తిగా ప్రభుత్వానికే సహకరిస్తున్నారని సమాచారం అందిందని, కోడెల కేసును రెండు రాష్ట్రాలు క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆ దర్యాప్తు నివేదికలను అమిత్‌షా దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.