చంద్రబాబు కోసం ఓదార్పుయాత్ర చేస్తున్న జనం !

Tuesday, June 4th, 2019, 12:11:26 PM IST

ఊహకు కూడా అందని రీతిలో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ శ్రేణులు అవాక్కయ్యారు. ఈ ఓటమితో పార్టీ పునాదులు కదిలిపోతాయా అని అంతా భయపడుతున్నారు. ఇంకో వైపు ఓటమితో చంద్రబాబు కుంగిపోతున్నారు అనే వార్తలతో కార్యకర్తలు మరింత ఆందోళనకు గురవుతున్నారట.
ఇదిలా ఉంటే కొంతమంది టీడీపీ అభిమానులు ఓటమిలో ఉన్న తమ నాయకుడ్ని కలిసి ధైర్యం చెప్పేందుకు నడుం బిగించారు.

ఫలితాల తర్వాత ఉండవల్లోని నివాసానికే పరిమితమైన చంద్రబాబు వద్దకు అంతా క్యూలు కడుతున్నారు. రోజుకి రెండొందల నుండి మూడొందల మంది వరకు ఇంటికి వెళ్లి మరీ బాబును కలుస్తున్నారు. వారిలో మహిళలది ప్రత్యేకమైన పాత్ర. బాబుని చూసిన ప్రతి ఒక్కరు మీరు ఓడిపోవడం ఏమిటయ్యా అంటూ కన్నీరు పెట్టుకుంటున్నారట. వారందరినీ ఓపిగ్గా పలకరిస్తున్న బాబు అధైర్యపడవద్దని, అంతా కలిసి కృషి చేసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలని చెబుతున్నారట.

మరి ఈ అభిమానులే స్వయంగా చేపడుతున్న ఈ ఓదార్పు యాత్ర పార్టీని ఎంతమాత్రం నిలబెడుతుందో చూడాలి.