ప్రకాశంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్

Tuesday, October 8th, 2019, 11:10:28 AM IST

ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. టీడీపీ నుండి అధికారపక్షము లోకి వలసలు మెల్ల మెల్లగా ఊపందుకుంటున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి రావాలంటే రాజీనామా చేసి రావాలని చెప్పటంతో చాలా మంది ఆగిపోయారు. అయితే గెలవని నేతలు, మాజీలు చాలా మంది వైసీపీ వైపు చూస్తున్నారు. అదే సమయంలో గతంలో వైసీపీలో పనిచేసి మధ్యలో టీడీపీ గూటికి చేరుకున్న కొందరు, తిరిగి వైసీపీలోకి వస్తున్నారు.

తాజాగా ప్రకాశం జిల్లాకి చెందిన జూపూడి ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ తీర్థం పుచ్చుకోవటానికి సిద్ధం అయ్యాడు. 2014 ఎన్నికల సమయంలో వైసీపీ వైపు ఉన్న జూపూడి తర్వాత టీడీపీకి మారిపోయాడు. టీడీపీలోకి వచ్చిన ఆయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కించుకున్నాడు. 2019 లో కొండెపి రిజర్వుడ్ నియోజకవర్గం నుండి పోటీచేయాలని చూశాడు, కానీ అక్కడ టికెట్ లభించకపోవటంతో నిరాశ చెందాడు.

2019 లో టీడీపీ ఓడిపోవటం, వైసీపీ ఘనవిజయం సాధించటంతో జూపూడి చూపు మళ్ళీ వైసీపీ మీద పడింది. టీడీపీలో ఉంటే భవిష్యత్తు లేదని భావించి తనకి దగ్గరి వ్యక్తులైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ద్వారా వైసీపీలోకి రావటానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు, అతని చొరవతో జూపూడి తిరిగి వైసీపీలోకి రాబోతున్నాడు. గత ఎన్నికల్లో కొండెపిలో వైసీపీ ఓడిపోవటంతో జూపూడి లాంటి నేతలను చేర్చుకొని వచ్చే ఎన్నికల నాటికీ అక్కడ బలపడాలనే ఆలోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది.