నిప్పు పెట్టిన జేసీ.. భగ్గుమన్న టీడీపీ

Thursday, July 11th, 2019, 06:09:16 PM IST

అవతలివారు ఏమనుకుంటారు అనే సంకోచం లేకుండా అనుకున్నది అనుకున్నట్టు చెప్పే మసతత్వం జేసీ సోదరులది. తాజాగా తాడిపత్రి మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో మిత్రుత్వం, శత్రుత్వం శాశ్వతం కాదు అంటూ త్వరలో టీడీపీ బీజేపీలో విలీనమవుతుందని వ్యాఖ్యానించారు. దీంతో తెలుగుదేశం పార్టీ భగ్గుమంది. అసలే ఓటమి భారం, మరోవైపు ఎగిరిపోవడానికి సిద్ధంగా ఉన్న నేతలు.. ఇవి చాలవన్నట్టు జేసీ వ్యాఖ్యలు. దీంతో వారి కోపం నషాళానికంటింది.

ఒక్కొక్కరు జేసీ మీద విరుచుకుపడుతున్నారు. కీలక నేతలు అసెంబ్లీ సమావేశాల్లో ఉండటంతో మిగిలినవారు స్పందిస్తున్నారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ కేవలం సంచలనాల కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జేసీకి తగదని అన్నారు. వేల మంది కార్యకర్తలు రక్తం చిందించి తెలుగుదేశం పార్టీని పటిష్టంగా నిర్మించారని, పదేళ్ళపాటు అధికారంలో లేని పార్టీని చంద్రబాబు తన పోరాటంతో అధికారంలోకి తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. మరోవైపు భాజపాలోకి వెళ్లాలా వద్దా అనే మీమాంసలో ఉన్న నేతలకు జేసీ వ్యాఖలు ఒకరకమైన ధైర్యానిచ్చాయి. మొత్తానికి జేసీ తన వ్యాఖ్యలతో పార్టీలో నిప్పు పెట్టేశారు.