వైసీపీలో ఉంటే మంత్రి పదవి దక్కేది.. పాపం టీడీపీ ఎమ్మెల్యే పెద్ద తప్పే చేసాడు..!

Sunday, June 16th, 2019, 05:20:58 PM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే అదృష్టం అందరికి ఒకేలా ఉండదు. ఇక రాజకీయాల్లో అదృష్టం ఎప్పుడు త‌లుపు త‌డుతుందో ఎవరూ చెప్పలేరు. అయితే ఒక నాయకుడిని మాత్రం అదృష్టం ముందు నుంచి తలుపు తడుతున్నా, దురదృష్టం మాత్రం నీడలా వెంటాడింది. ఇంతకీ ఎవరౌ ఆయన అనుకుంటున్నారా.

అయితే పూర్తి వివరాలలోకి వెళితే ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుని నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన తొలిసారి 2004లో మార్టూరు నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజ‌యం సాధించారు. అయితే రెండో సారి మాత్రం 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి మరోసారి విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి 2014లో వైసీపీలోకి చేరి వైసీపీ నుంచి మూడో సారి గెలుపొందారు. అయితే 2014 ఎన్నికలలో వైసీపీ ఓడిపోవడం, టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కుతుందనే ఆశతో టీడీపీలోకి మారిపోయారు. అయితే టీడీపీలో మాత్రం ఈయనకు తగిన గుర్తింపు రాలేదు, మంత్రి పదవి దక్కలేదు.

అయితే ఈ సారి జరిగిన ఎన్నికలలో టీడీపీ నుంచి మళ్ళీ పోటీ చేసి వైసీపీపై విజయం సాధించారు. అయితే ఇప్పుడు టీడీపీ అధికారం కోల్పోయి వైసీపీ అధికారంలోకి రావడంతో తన మంత్రి పదవిపై ఆశలు వదులుకున్నారు. అయితే 2014లో టీడీపీలో చేరకుండా ఉండి ఉంటే వైసీపీలో జగన్ ఖచ్చితంగా ఈ సారి మంత్రివర్గంలో చోటు కల్పించేవారని ఆ రోజు పార్టీ మారుతూ తీసుకున్న నిర్ణయం తనను మంత్రి పదవికి దూరం చేస్తుందని ఊహించలేదని తన సహచరులతో చెప్పి గొట్టిపాటి రవికుమార్ ఇప్పుడు బాధపడుతున్నారట. ఏది ఏమైనా రాజకీయాలలో ఎంత మంచి పేరు ఉన్న కూడా అప్పుడప్పుడు కాస్త సహనం కూడా అవసరమని ఈయనను చూస్తుంటే అర్ధమవుతుంది.