2024 ఎన్నికలలో పోటీ చేయను.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన నిర్ణయం..!

Tuesday, August 13th, 2019, 03:55:27 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. అయితే అసలే ఘోర ఓటమితో బాధపడుతున్న చంద్రబాబుకు ఆది నుంచి పార్టీలో షాక్‌లే తగులుతున్నాయి.

అయితే పార్టీలో తన అనుకున్నవాళ్ళంతా టీడీపీ ఓటమి పాలవ్వడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోయారు. ఇక మిగిలిన నేతలైనా సరిగ్గా ఉన్నారా అంటే వారి మాట్లాడే మాటలు బట్టి చూస్తుంటే ఎవరు ఎప్పుడు పార్టీనీ వీడుతారో అని చంద్రబాబులో భయం మొదలైంది. అయితే గత కొద్ది రోజులుగా ఎంపీ కేశినేని నాని సొంత పార్టీపైనే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. అయితే చంద్రబాబుకు ఆయన పెద్ద తలనొప్పిగా మారిన పార్టీ మనుగడ కోసం ఏమీ అనలేకపోతున్నారు. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ చౌదరి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో పెద్ద కలకలం రేపుతుంది. నేడు మీడియాతో మాట్లాడిన బుచ్చయ చౌదరి టీడీఎల్పీ ఉపనేత పదవికి రాజీనామా చేస్తున్నానని ఆ పదవిని బీసీ నేతలకు ఇవ్వమని చంద్రబాబును కోరుతానని అన్నారు. అంతేకాదు పార్టీలో కొందరు సీనియర్లను ఉద్దేశించి తెల్ల ఏనుగులను పక్కన పెట్టాలని సూచించారు. ఆరు సార్లు ఓడిపోయిన వారికి కూడా పార్టీలో ప్రాధాన్యత ఎందుకు అని మండిపడ్దారు. అంతేకాదు తాను ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని వచ్చే ఎన్నికలలో దాదాపు పోటీ చేయనని ప్రకటించారు. అంతేకాదు పార్టీలో యువతకు అవకాశాలు రావాలంటే సీనియర్లు తప్పుకోవాలని సూచించారు. మరి ఈయన తీసుకున్న నిర్ణయం పట్ల చంద్రబాబు ఎలా స్పందిస్తారనేది తెలియాల్సి ఉంది.