ఫేస్‌బుక్‌లో మరోసారి టీడీపీ ఎంపీ కేశినేని షాకింగ్ కామెంట్స్..!

Wednesday, June 12th, 2019, 02:34:24 PM IST

టీడీపీ ఎంపీ కేశినేని నాని గత కొద్ది రోజులుగా తన ఫేస్‌బుక్‌ ద్వారా సంచలన పోస్ట్‌లు పెడుతూ మీడియాకెక్కారు. అయితే తాజాగా తన ఫేస్‌బుక్‌లో మరో సంచలన పోస్ట్ పెట్టారు. నేను ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే వ్యక్తిని తాను కాదన్నారు కేశినేని. “నేను స్వయంశక్తిని నమ్ముకున్న వ్యక్తిని. ఎవరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే వాడిని కాదు. నీతి, నిజాయితీ, వక్తిత్వం, ప్రజాసేవ మాత్రమే నా నైజం. నిజాన్ని నిజమని చెబుతాను. అబద్ధాన్ని అబద్దమనే చెబుతాను. మంచిని మంచి అనే అంటాను. చెడును చెడు అనే అంటాను. న్యాయాన్ని న్యాయమని మాట్లాడతాను. అన్యాయాన్ని అన్యాయమని మాట్లాడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం మాత్రమే తెలిసిన వాడిని. నిండు సభలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన వాడిని నేను. నిండు సభలో మోడీని నిలదీసిన వ్యక్తిని. భయం నా రక్తంలో లేదు. రేపటి గురించి ఆలోచన అంతకంటే లేదు. ఎవరెన్ని పెడార్థాలు తీసిన, వీపరీతార్థాలు తీసిన లెక్క చేసే వాడిని కాదు” అని ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు.

అయితే కేశినేని నాని టీడీపీ ఓటమి పాలైనప్పటికి ఎంపీగా గెలిచాడు. అయితే గత కొద్ది రోజులుగా ఈయనపై పార్టీ మారబోతున్నారంటూ బీజేపీ పెద్దలతో ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపారని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన విప్ పదవిని కూడా వద్దని చెప్పడంతో టీడీపీపై కాస్త వ్యతిరేకత చూపుతున్నారని అందరికి అర్ధమైపోయింది. అయితే అప్పటి నుంచి తన ఫేస్‌బుక్‌లో వరస ట్వీట్లతో సంచలన వ్యాఖ్యలు చేస్తూ మీడియా దృష్ట్యా వార్తల్లోకెక్కాడు. అయితే మొన్న ఏపీ మంత్రి కొడాలి నానిపై కూడ ఒక ట్వీట్ పెట్టారు. కోడాలి నాని తనకు మంత్రి పదవి దక్కేలా చేసిన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమాకు జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలని పెట్టిన ట్వీట్ పార్టీలో పెద్ద చర్చానీయాంశంగా మారింది. అది మరవక ముందే నేడు మరో ట్వీట్‌తో సంచలనం సృష్టించాడు. అయితే ఇవన్ని ఎవరిని ఉద్దేశించి పెడుతున్నాడో తెలీదు కానీ పార్టీలో మాత్రం ఈయన వ్యవహార శైలిపై అందరూ దుమ్మెత్తి పోస్తున్నారట.