టీడీపీ పార్టీనీ వీడే ప్రసక్తే లేదు.. తేల్చి చెప్పిన టీడీపీ సీనియర్ నేత..!

Thursday, July 4th, 2019, 11:16:47 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుని ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవి బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే అధికార పార్టీ టీడీపీ మాత్రం గెలుపే లక్ష్యంగా పెట్టుకుని పని చేసినా ఈ ఎన్నికలలో మునుపెన్నడు లేని రీతిలో ఓటమి పాలైంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 151 స్థానాలను వైసీపీ గెలుచుకుంటే, టీడీపీ మాత్రం కేవలం 23 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇక ఇప్పుడిప్పుడే టీడీపీ తిరిగి కోలుకునే అవకాశాలు కూడా కనిపించడంలేదు.

అయితే ఇక టీడీపీలో ఉంటే తమ రాజకీయ జీవితం ఇంతటితోనే ముగిసిపోతుందని భావిస్తున్న కొందరు నేతలు టీడీపీని వీడి బీజేపీలో చేరిపోతున్నారు. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం ఫిరాయింపులను ప్రోత్సహించకపోవడంతో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోతున్నారు. అయితే ఇప్పటికే నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు, మరికొంత మంది టీడీపీ సీనియర్ నేతలు బీజేపీలో చేరిపోయారు. అయితే గత కొద్ది రోజులుగా టీడీపీ పార్టీలో సీనియర్ నేతలుగా ఉన్న జేసీ బ్రదర్స్ కూడా పార్టీనీ వీడి బీజేపీలో చేరుతున్నారంటూ తెగ ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను పార్టీ మారే ప్రసక్తే లేదని, అధికారంలో ఉన్నా, లేకున్నా తాము పార్టీలోనే కొనసాగుతామని గత 40 సంవత్సరాలుగా జేసీ కుటుంబాన్ని ఆదరిస్తున్న తాడిపత్రి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మీడియా ద్వారా చెప్పారు. అంతేకాదు ఆయన కుమారుడు జేసీ పవన్ రెడ్డి కూడా పార్టీ మారే ఆలోచన తమకు లేదని చెప్పుకొచ్చాడు.