బిగ్ బ్రేకింగ్: రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన టీడీపీ సీనియర్ నేత..!

Monday, June 3rd, 2019, 05:58:28 PM IST

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటే, టీడీపీ మాత్రం ఘోర పరాభవాన్ని చవి చూసింది. అయితే ఈ ఎన్నికలలో ప్రధానంగా మూడు పార్టీలు బరిలో ఉన్నా గెలుపు మాత్రం టీడీపీ, వైసీపీల మధ్యనే కనిపించింది. అయితే ఎన్నికలకు ముందు అందరూ అనుకున్న అంచనాలను, సర్వే ఫలితాలను తలదన్నేలా వైసీపీ ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాలను గెలుచుకుని విజయ దుందుభి మోగించింది. అంతేకాదు నాలుగు రోజుల క్రితమే ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ ప్రమాణస్వీకారం కూడా చేశారు.

అయితే ఈ నేపధ్యంలో రాజకీయాలలో కీలకంగా వ్యవహరించిన టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం అనంతపురంలోని ఎస్పీ కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ తాను ఇక ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పేసారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో తనకు మద్ధతుగా నిలిచిన ప్రజలకు, తన పార్టీకీ, పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అధికారాన్ని చేపట్టిన జగన్‌పై రాజకీయ విమర్శలు చేశానే తప్ప జగన్‌పై ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఎటువంటి ద్వేషం నాకు లేదని ఆయన అన్నారు. అంతేకాదు తాను ఎన్నటికి పార్టీ మారబోనని కూడా స్పష్టం చేశారు. అయితే రాజకీయాలపై ప్రస్తుతం తనకు ఆసక్తి లేదని అందుకే ఇక రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన మీడియాతో చెప్పారు. ఏదేమైనా జేసీ దివాకర్‌రెడ్డి తొందరపాటు నిర్ణయంతో ఒక సీనియర్ నాయకుడు దూరమవ్వడంతో టీడీపీ బలం మరింత తగ్గే అవకాశాం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయట.