యార్లగడ్డ పరువు తీసిన టీడీపీ.. ఎలా సమర్ధించుకుంటాడో..!

Saturday, November 9th, 2019, 01:00:22 AM IST


ఏపీలో వైసీపీ అధికారం చేపట్టిన ఈ ఆరునెలలోనే సీఎం జగన్ ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు. అయితే తాజాగా ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళుగా మార్చాలని జగన్ కొత్త జీవోను జారీ చేశారు. దీనిపై స్పందించిన అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ ఏపీలో జీవో 81 విడుదల చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు కూడా తెలుగు మాధ్యమంలో కాకుండా, ఆంగ్ల మాధ్యమంలో చదువు కావాలని జగన్‌ పాదయాత్రలోనే కోరారని ప్రజాభీష్టానికి అనుగుణంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

అయితే ఇదే యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ గతంలో టీడీపీ ఈ ప్రస్థావనను తీసుకొచ్చినప్పుడు ఎలా స్పందించారో అంటూ టీడీపీ ఆయనపై విమర్శలు గుప్పిస్తుంది. తెదేపా హయాంలో ఇంగ్లీష్ మీడియంను ఒక ఐచ్చికంగా, అది కూడా పురపాలిక పాఠశాలల్లో పెడతామంటే ఆంధ్రప్రదేశ్ ను ఆంగ్ల ప్రదేశ్ గా చేస్తారా అని ఆందోళన చేసారని, మరి ఈరోజు రాష్ట్రమంతా ఇంగ్లీష్ మీడియం అంటే అంతా ప్రజల కోరిక మేరకు జరిగిందని సర్ది చెప్పుకుంటున్నారని ఒక వీడియోను చేసి మరీ ఆయన పరువు తీస్తుంది టీడీపీ. మరి దీనిని ఆయన ఎలా సమర్ధించుకుంటారో చూడాలి మరీ.