బిగ్ అప్డేట్ : అసెంబ్లీ నుండి తెలుగుదేశం పార్టీ నేతలు వాకౌట్

Monday, December 16th, 2019, 10:39:37 AM IST

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల నుండి, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. కాగా నేడు కొద్దీసేపటి క్రితం అసెంబ్లీలో ఆరవ రోజు శాసనసభ ప్రారంభమైంది. అయితే సభలో తమకు మాట్లాడే అవకాశాన్ని కల్పించడం లేదని ఆరోపిస్తూ టీడీపీ నేతలు సభనుండి బయటకు వెళ్లిపోయారు. కాగా ప్రశ్నోత్తరాల సమయంలో హౌసింగ్‌ పై జరుగుతున్నటువంటి చర్చలో భాగంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తున్నారు. అయితే ఆయన మాటలు అర్థం కావడం లేదని, అందుకని తమకు మాట్లాడే అవకాశాన్ని కల్పించాలని సభలో టీడీపీ నేతలు స్పీకర్ ని కోరారు. ఈ సమయంలో స్పీకర్ టీడీపీ నేతలని పట్టించుకోకుండా వేరే ప్రశ్నకి వెళ్లడంతో, ఆయన తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ టీడీపీ నేతలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

ఇకపోతే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రివర్స్‌పాలన, తిరోగమనంలో రాష్ట్ర అభివృద్ధి అంశంపై తెలుగుదేశం పార్టీ నేతలు చంద్రబాబు ఆధ్వర్యంలో సచివాలయం ఫైర్‌స్టేషన్‌ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. ఈమేరకు చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో రివర్స్‌ పాలన వల్ల రాష్ట్రం అధోగతి పాలైందని, టెండర్లన్నీ రిజర్వ్‌ చేసుకొని రివర్స్‌ అంటున్నారని ఆరోపించారు. అధికారం సాదించామన్న గర్వంతో వైసీపీ ప్రభుత్వం, నేతలందరు కూడా రాష్ట్ర ప్రజలందరినీ తీవ్రమైన ఇబందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.