టీడీపీ భవిష్యత్తు బాలకృష్ణ చేతుల్లోనే ఉందట

Wednesday, June 12th, 2019, 07:50:45 AM IST

గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలనే గెలుచుకుని తీవ్ర పరాజాయ్ని చవిచూసింది. ఈ ఘోర వైఫల్యంతో పార్టీ క్యాడర్లో న్యాయకత్వ లోపమే ఇందుకు ప్రధాన కారణమనే మాట వినిపిస్తోంది. సీనియర్లు బయటకి ఏది ఏమైనా చంద్రబాబే తమ నాయకుడని అంటున్నా యువత మాత్రం కొత్త న్యాయకత్వం వైపు చూస్తున్నారు. వైకాపా యువనేత జగన్ సారథ్యంలో దూకుడుగా ముందుకుపోతుంటే టీడీపీ మాత్రం చంద్రబాబు మూస ధోరణితోనే వెనకంజలో ఉందని వారంతా భావిస్తున్నారు.

రాబోయే రోజుల్లో పార్టీ పరిస్థితి మారాలంటే పార్టీ పగ్గాలు చేతులు మారాలని అంటున్నారు. అయితే ఆ పగ్గాలు చంద్రబాబు కుమారుడు లోకేష్ చేతికి కాకుండా ఎన్టీఆర్ వారసుల చేతిలోకి వెళ్లాలనేది అసలైన డిమాండ్. యువ క్యాడర్ దృష్టిలో ఎన్టీఆర్ వారసుడిగా మొదటి నుండి తారక్ మెదులుతున్నాడు. ఆయన పార్టీలోకి రావాలని అంతా కోరుకున్నారు. కానీ తారక్ మాత్రం రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఇప్పుడప్పుడే ఆయన పార్టీలోకి అడుగిడే పరిస్థితి లేదు.

దీంతో వారి దృష్టి బాలయ్య మీద పడింది. ఈ ఆపద కాలం నుండి బయటపడాలంటే బాలయ్య ఒక్కడే దారని, ఇకనైనా ఆయన ధైర్యం చేసి పగ్గాలను చంద్రబాబు నుండి చేజిక్కించుకుంటే మంచిదని, అప్పుడే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని భావిస్తున్నారు. రెండు రోజుల క్రితం బాలయ్య పుట్టినరోజు సందర్బంగా జరిపిన వేడుకల్లో యువత మొత్తం ఇదే అభిప్రాయాన్ని బలంగా వ్యక్తం చేశారు. మరి బాలయ్య వారి అభీష్టం మేరకు పార్టీ పగ్గాలను అందుకునే దిశగా పనిచేస్తారేమో చూడాలి.