అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్సింగ్స్‌లో టీమిండియా చెత్త రికార్డ్ నమోదు చేసుకుంది. మూడో రోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ పేకమేడలా కుప్పకూలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి ఏ ఒక్కరు కూడా క్రీజులో నిలబడి రెండంకెల స్కోరును నమోదు చేయలేకపోయారు. జట్టు స్కోర్ 9/1 దగ్గర మూడో రోజు ఆట ప్రారంభించిన కోహ్లీ సేన 31 పరుగులకే 9 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 4 పరుగులకే వెనుదిరగగా పుజారా, రహానె, అశ్విన్ డకౌట్ అయ్యారు.
అయితే భారత క్రికెట్ జట్టు టెస్ట్ చరిత్రలోనే ఇది అత్యల్పమైన స్కోరుగా నిలిచింది. గతంలో 1974 లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 42 పరుగులకు ఆలౌట్ కాగా, 1947లో ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు చేయగా, 1952లో మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 58 పరుగులు, 1996లో దక్షిణాఫ్రికాతో జరిగిన డర్బన్ మ్యాచ్‌లో 66 పరుగులు, 1948లో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్‌లె 67 పరుగులు చేసింది. 46 ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న చెత్త రికార్డును మనోళ్ళు బ్రేక్ చేయడంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నొరాశకు గురయ్యారు. ఇదిలా ఉంటే ఇదే మ్యాచ్ భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 244 పరుగులు చేయగా, భారత భౌలర్ల ధాటికి అసీస్ 191 పరుగులకే ఆలౌటయ్యింది. అయితే తొలి ఇన్నింగ్స్‌లో 53 పరుగుల అధిక్యంలో ఉన్న భారత్ రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తెయడంతో మ్యాచ్ ఆసీస్ చేతుల్లోకి వెళ్ళిపోయింది.