ఓ ఇంటివాడైన టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా..!

Monday, March 15th, 2021, 05:12:18 PM IST

టీమిండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌ని బుమ్రా వివాహమాడాడు. అయితే అతి కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో గోవాలో వీరి పెళ్ళి వేడుక ఘనంగా జరిగినట్టు తెలుస్తుంది. తన పెళ్ళి విషయాన్ని స్వయంగా బుమ్రానే సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ రోజు మేము సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించామని, మా జీవితాల్లోని సంతోషకరమైన రోజులలో ఈ రోజు ఒకటి అని, మా పెళ్లి వార్తను, మా ఆనందాన్ని మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని బుమ్రా చెప్పుకొచ్చాడు.

అయితే అసలు బుమ్రా పెళ్ళాడిన ఈ సంజనా గణేశన్ ఎవరంటే మహారాష్ట్రకు చెందిన సంజనా ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత జర్నలిస్ట్గా మారింది. ప్రస్తుతం ఆమె ఐపీఎల్ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా ఆమె స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా వర్క్ చేశారు. ఇదేకాదు 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో సంజన్ ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. సంజనా‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.