బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు..!

Friday, April 2nd, 2021, 08:39:17 PM IST

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయడం లేదని ఇటీవల బోడ సునీల్ నాయక్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే నిమ్స్‌లో చికిత్స పొందుతూ నేడు సునీల్ నాయక్ ప్రాణాలు విడిచాడు. దీంతో పోస్టుమార్టం అనంతరం పోలీసులు అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.

అయితే సునీల్ నాయక్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నర్సంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు మరికొందరు నేతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే రాజకీయ నేతలు అక్కడికి వెళితే పరిస్థితి ఉద్రిక్తతంగా మారి అంత్యక్రియలకు ఆలస్యం అవుతుందని భావించిన పోలీసులు నేతలను అక్కడికి రాకుండా ముందుగానే అడ్డుకుంటున్నారు. ఇదిలా ఉంటే సునీల్ నాయక్ ఆత్మహత్య ముమ్మాటికి ప్రభుత్వ హత్యే అని బండి సంజయ్ ఆరోపణలు చేశారు.