తెలంగాణ కేబినెట్ భేటీలో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

Wednesday, June 9th, 2021, 02:27:22 AM IST

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో జరిగిన కేబినెట్ భేటీలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కేబినెట్, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్‌డౌన్ నుంచి సడలింపు ఇచ్చింది. అయితే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని పోలీసుశాఖను కేబినెట్ ఆదేశించింది.

ఇక ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికీ 30 శాతం పీఆర్సీనీ ఇస్తామని గతంలోనే ప్రకటించిన సీఎం కేసీఆర్ నిర్ణయానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. పెంచిన పీఆర్సీ వేతనాన్ని జూన్ నెల నుంచి అమలు చేసి చెల్లించాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను కేబినెట్ ఆదేశించింది.

ఇకపోతే ప్రభుత్వ దవాఖానల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలను సమీక్షించేందుకు ఓ సబ్ కమిటీని నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధ్యక్షులుగా, మంత్రులు జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వేముల ప్రశాంత్ రెడ్డి, వి.శ్రీనివాస్ గౌడ్, పి. సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సభ్యులుగా ఉంటారని వారంతా కలిసి దేశంలో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్న తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటుగా, ఉత్తమమైన వైద్య ఆరోగ్య సేవలను అందిస్తున్న పొరుగు దేశమైన శ్రీలంకకు కూడా వెళ్లి అక్కడి వైద్య సేవలపై కూడా అధ్యయనం చేసి సమగ్ర నివేదికను అందించాలని కేబినెట్ ఆదేశించింది.

ఇక రాష్ట్రంలో రేపటినుంచి ప్రారంభించబోతున్న 19 డయాగ్నోస్టిక్స్ కేంద్రాలతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అన్ని జిల్లాల్లోని డయాగ్నస్టిక్ కేంద్రాల్లో ఈసీజీ డిజిటల్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్, టుడీ ఈకోతో పాటుగా మహిళల కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను కూడా ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు విషయంలో కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాాద్ జిల్లా మినహా పాత తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను (టీఎస్ ఎఫ్.పి.జెడ్) ఏర్పాటు చేయాలని, ఒక్కొక్కటి 250 ఎకరాలకు తగ్గకుండా రైస్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.

ఇక రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యలు, రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యల పరిష్కారానికై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్ అధ్యక్షతన ఏర్పాటైన ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారు. రాష్ట్రంలో కాళేశ్వరం సహా అనేక సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కెబినెట్ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది వానాకాలం, యాసంగిలో సుమారు 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి కావడం పట్ల కూడా కేబినెట్ సంతోషం వ్యక్తం చేసింది.