ఉమ్మడి రాజధాని భవనాలు.. తెలంగాణ సర్కారుకు అప్పగింత..!

Monday, June 3rd, 2019, 09:20:11 AM IST

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై కీలకమైన ముందడుగు పడింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కృషి ఫలించింది. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించిన సచివాలయం, అసెంబ్లీ, శాఖాధిపతుల కార్యాలయాలన్నింటినీ తెలంగాణ రాష్ట్రానికి అప్పగిస్తూ గవర్నర్ నరసింహన్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆదివారం నాడు గవర్నర్ ఇరు రాష్ర్టాలకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. గవర్నర్ నిర్ణయంపై సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. తాజా ఉత్తర్వుల ప్రకా రం రాజధాని హైదరాబాద్‌లో ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భవనాలు ఇక నుంచి తెలంగాణ ప్రభుత్వం చేతికి తిరిగిరానున్నాయి. ఏపీ ప్రభుత్వ అవసరాలకోసం పోలీస్‌శాఖకు ఒక భవనం, ఇతర శాఖలన్నింటి అవసరాల నిమిత్తం మరో భవనాన్ని కేటాయించాలని గవర్నర్ ప్రొసీడింగ్స్‌లో పేర్కొనడం జరిగింది.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనకున్న అధికారాలను ఉపయోగించుకొని హైదరాబాద్‌లోని ఏపీ ప్రభుత్వానికి కార్యాలయాలను నిర్వహించుకోవడానికి కేటాయించిన భవనాలను తిరిగి ఇవ్వాలని కోరుతూ సర్క్యులేషన్ పద్ధతిలో తెలంగాణ మంత్రివర్గం ఆమోదించిన తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేయగా దానికి ఆయన సానుకూలంగా స్పం దించారు. గత ఐదేండ్లుగా ఏపీ ప్రభుత్వం ఈ భవనాలకు చెల్లించాల్సిన అన్నిరకాల పన్నులను తెలంగాణ ప్రభుత్వం రద్దుచేయాలని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు విభజన సమస్యలు పరిష్కారం కాలేదు. ఏపీ ప్రభుత్వం ఏనాడూ ముందుకు రాలేదు. చివరకు ఖాళీచేసిన భవనాలను సైతం అప్పగించడానికి ససేమిరా అన్నది. ఈ సమస్యను పరిష్కరించాలని సీఎం కేసీఆర్ అనేకసార్లు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. చివరకు కేంద్రానికి కూడా ఫిర్యాదుచేశారు. తెలంగాణపై నిత్యం కుట్రలుసాగించే ఉద్దేశంతో నాటి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు విభజన సమస్యలు పరిష్కారం కాకుండా అడ్డుపడుతూవచ్చారు. సీఎం కేసీఆర్ కృషికి తోడుగా ఏపీలో కొత్తగా వైఎస్ జగన్ సారథ్యంలో ఏర్పడిన ప్రభుత్వం విభజన సమస్యల పరిష్కారానికి చొరువ చూపడంతో ప్రధాన సమస్య తీరిపోయినట్టుగా కనిపిస్తుంది.