జగన్ మీద కాంగ్రెస్ నేతలు ప్రేమ బయటపడుతోంది

Wednesday, June 12th, 2019, 08:30:56 AM IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద ప్రస్తుత కాంగ్రెస్ నేతలకు చాలానే అభిమానం ఉంది. రాష్ట్రం విడిపోయాక కాంగ్రెస్ పార్టీ కూడా రెండుగా విడిపోయింది. ఏపీలో ఉన్న సగం పార్టీ ఇప్పటికే నిర్వార్యంకాగా తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నేతలు పుంజుకోవడం కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ మంత్రివర్గ విస్తరణ, సంక్షేమ పథకాల అమలుపై తీసుకుంటున్న నిర్ణయాల మీద మాట్లాడటానికి ఏపీ కాంగ్రెస్ నేతలకు ఆస్కారం లేకపోయినా తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బాహాటంగానే కొత్త సీఎంను పొగిడేస్తున్నారు.

మొన్నటికి మొన్న విజయశాంతి మంత్రివర్గంలో జగన్ మహిళలకు పెద్ద పీఠ వేయడాన్ని ప్రస్తావిస్తూ మహిళా మంత్రులకు అవకాశం ఇవ్వకుండా ఐదేళ్ల కాలాన్ని గడిపేసిన కెసిఆర్ గారు… రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మహిళలకు తన మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు. ఏపీ ముఖ్యమంత్రి చూసి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ఆయన నేర్చుకోవాలని ఎద్దేవా చేయగా తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సైతం రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే ప్రజలకు శ్రేయస్కరమైన పథకాల్ని ప్రవేశపెట్టారో ఆయన బిడ్డ జగన్ కూడా అలానే చేస్తున్నాడని, ఆయన నిర్ణయాలు అభినందనీయం అని కొనియాడారు. మరీ ముఖ్యంగా అమ్మ ఒడి, ప్రైవేట్ పాఠశాలల్లో పేద పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయింపు వంటి నిర్ణయాలను మెచ్చుకుని జగన్ మీదున్న అభిమానాన్ని బయటపెట్టుకున్నారు.