తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. క్లారిటీ ఇచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్..!

Friday, April 2nd, 2021, 02:04:34 AM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలో తెలంగాణ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు షాపులు, వ్యాపార సముదాయాలు, ప్లే జోన్లు మూసేయాలని ఉత్తర్వులు జారీ చేసినట్టు, ఈ ఆదేశాలు వెంటనే అమలులోకి వస్తాయని ఆ ఉత్తర్వుల్లో ఉండడంతో ఇది నిజమని చాలా మంది షాక్‌కి గురయ్యారు.

అంతేకాదు ఈ నెల 30 వరకు లేదా తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని అందులో పేర్కొనడంతో చాలా మంది దీనిని నమ్మేశారు. అయితే దీనిపై స్పందించిన తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించాలన్న ఆలోచన ప్రస్తుతం ప్రభుత్వానికి లేదని, సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ఫేక్ వార్తలను నమ్మకూడని సూచించారు.