ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ ఇచ్చిన తెలంగాణ సర్కార్..!

Wednesday, October 9th, 2019, 06:48:36 PM IST

తెలంగాణలో ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె తీవ్రతరంగా మారింది. ప్రభుత్వం ఎన్ని బెదిరంపులు చేస్తున్నా ఆర్టీసీ కార్మికులు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించిన కారణంగా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కేసీఆర్ ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని, ఇక మీదట ఆర్టీసీ కార్మికులతో ఎలాంటి చర్చలు జరిపేది లేదని తేల్చి చెప్పారు. యూనియన్ బ్లాక్ మెయిళ్లకు భయపడబోమని, ప్రభుత్వం విధించిన గడువులోగా విధులకు హాజరుకానీ సిబ్బందిని తిరిగి విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని, ఆర్టీసీ మనుగడ సాధించాలంటే కొన్ని చర్యలు తప్పవని, ఇక ఆర్టీసీలో మిగిలింది కేవలం 1200 మంది ఉద్యోగులు మాత్రమే అని త్వరలో కొత్త సిబ్బంది నియామకం చేపట్టాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు ఆర్టీసీలో కొన్ని కీలక మార్పులు తీసుకువచ్చారు. ఆర్టీసీనీ మొత్తం మూడు రకాలుగా విభజిస్తూ 50% బస్సులు ఆర్టీసీ నడుపుతుందని, 30% బస్సులు అద్దెవి నడుపుతామని, మరో 20% బస్సులు పూర్తిగా ప్రైవేట్ బస్సులు నడిపేలా ప్రణాళికలు రూపొందించారు.

అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానంలో తేల్చుకుంటామని ఆర్టీసీ కార్మికుల సంఘం దానికి రెడీ అయిపోయింది. అయితే కార్మికులు తమ డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేపడితే ఉద్యోగాలు తీసేశాం అంటూ ప్రభుత్వం భయపెడుతుందని అటు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వ వైఖరిపై సీరియస్‌గా ఉన్నాయి. అయితే ఇలాంటి వాతావరణం ఉన్న తరుణంలో తాజాగా ఆర్టీసీ కార్మికులకు మరో షాక్ ఇచ్చింది తెలంగాణ సర్కార్. తార్నాకలోని ఆర్టీసీ కార్మికుల ఆసుపత్రిలో వైద్యాన్ని నిలిపివేసింది. అయితే ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న నేపధ్యంలో ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి ఉచిత వైద్య సేవలు అందకూడదని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టుగా అర్ధమవుతుంది. అయితే దీనిపై ఆర్టీసీ కార్మికులు తార్నాకలోని ఆర్టీసీ కార్మికుల ఆసుపత్రి దగ్గర పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియచేస్తున్నారు.