మద్యం బాధితుల కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..!

Monday, March 30th, 2020, 11:00:16 PM IST

కరోనా వైరస్ కారణంగా 21 రోజులు లాక్‌డౌన్ పాటిస్తున్న నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలో మద్యం షాపులు అన్ని మూతపడిన సంగతి తెలిసిందే. అయితే మద్యం షాపులతో పాటు కల్లు దుకాణాలు కూడా మూతపడడంతో మందుబాబులు అల్లాడిపోతున్నారు.

మద్యం, కల్లు దొరకక కొందరు ఆత్మహత్య చేసుకుంటుంటే, మరికొందరు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. దీనితో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కు ఓపీ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో కరోనావైరస్ కంటే ఇప్పుడు మద్యం బాధితులే ఎక్కువవుతున్నారు. అయితే ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వెళ్ళడంతో తెలంగాణ ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే మద్యానికి బానిసలుగా మారినవారి మానసిక ఆందోళన పరిస్థితులపై చర్చించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులకు కీలక సూచనలు జారీ చేశారు.

మద్యం దొరక్క పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్న వారి వివరాలను సేకరించాలని ఎక్సైజ్ ఎస్సై, సీఐలను ఆదేశించారు. అంతేకాదు మద్యానికి బానిసై మానసికంగా బాధపడుతున్న వారిని డిఅడిక్షన్ సెంటర్లలో ఉంచి చికిత్స అందించాలని అన్నారు. యోగా, ధ్యానం, ఆధ్యాత్మికం వైపు వారి మనసు మళ్లించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇకపోతే లాక్‌డౌన్ ఉన్నన్ని రోజులు మద్యం షాపులు మూసే ఉంటాయని, బ్లాక్‌లో మద్యం అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.