అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రాకండి – హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు

Friday, May 14th, 2021, 12:53:35 AM IST

తెలంగాణలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో సత్పలితాలు కనిపిస్తున్నాయని, రోజు వారీ కేసులు కూడా పక్క రాష్ట్రాల కంటే తెలంగాణలో తక్కువగానే నమోదవుతున్నాయని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. లాక్‌డౌన్ సమయంలో అత్యవసరం అయితే తప్ప ప్రజలెవరూ బయటకు రావొద్దని, లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో కూడా ప్రజలందరూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

అయితే రాష్ట్రంలో మే 31 వరకూ సెకండ్ డోస్ వారికే వ్యాక్సిన్ ఇస్తామని, ప్రజలు దీనికోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కోవిషీల్డ్ రెండో డోసును 6 నుంచి 8 వారాల మధ్యలో తీసుకోవాలని, కోవ్యాగ్జిన్ 4 నుంచి 6 వారాల మధ్యలో తీసుకోవాలని అన్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకు ఎలాంటి కొరత లేదని, ప్రైవేట్ ఆసుపత్రులు ఆక్సిజన్‌ను సక్రమంగా వినియోగించాలని ఆక్సిజన్, రెమిడెసివర్ గురించి స్టేట్ టాస్క్‌ఫోర్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని అన్నారు.