తెలంగాణ ఇంటర్ బోర్డ్ ఇక మారదా !

Wednesday, June 5th, 2019, 03:18:59 PM IST

తప్పు మీద తప్పు.. విద్యార్థుల జీవితాలతో చెలగాటం. ఇది తెలంగాణ ఇంటర్ బోర్డ్ వ్యవహారం. ఎన్ని చీవాట్లు తిన్నా, పూడ్చలేని నష్టం జరిగినా బోర్డ్ అధికారులు మాత్రం నిర్లక్ష్యాన్ని వీడలేదు. ఇప్పటికే తప్పుడు ఫలితాలు వెలువరించి కొందరు విద్యార్థుల ప్రాణాల్ని బలిగొన్న బోర్డు రీవెరిఫికేషన్ ఫలితాల్లో పాత తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసి అభాసుపాలైంది.

రీవెరిఫికేషన్ ప్రక్రియలో మొదట వదిలిన రిజల్ట్స్ తప్పని, గతంలో ఫెయిల్ అయిన ఎవరికీ మార్కులు పెరగలేదని చెప్పి విద్యార్థుల ఆగ్రహానికి గురైన బోర్డ్ తాజాగా అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నా పత్రాలను పోగొట్టి మరొక పెద్ద తప్పిదం చేసింది. వరంగల్ మీర్ కాలనీలోని పోలీస్ స్టేషన్లో ఉంచిన రెండు సీల్డ్ పెట్టెల్లోని ప్రశ్నా పత్రాలు మాయమయ్యాయి.

దీనిపై స్పందించిన పోలీసులు పెట్టెలు భద్రపరిచిన గదుల్లోకి వెళ్లింది బోర్డ్ అధికారులేనని కాబట్టి భాద్యత వారిదేనని అంటున్నారు. బోర్డ్ అధికారులు మాత్రం ప్రశ్నా పత్రాలు పోయిన విషయాన్ని దాచిపెట్టి రెండు రోజులుగా వెతుకుతున్నారు. మరోవైపు ఎల్లుండి నుండి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. దీంతో విద్యార్థుల్లో పరీక్ష ఎలా రాస్తామన్న ఆందోళన కంటే బోర్డ్ పరీక్షల్ని, ఫలితాల వెల్లడి ప్రక్రియను సక్రమంగా నిర్వహిస్తుందా లేదా అనే టెంక్షన్ ఎక్కువగా ఉంది.