తప్పుల్ని కప్పిపుచ్చుకునే పనిలో తెలంగాణ ఇంటర్ బోర్డ్ !

Sunday, June 2nd, 2019, 06:15:44 PM IST

తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పిదాలతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ర్యాంకులు ఆశించిన వారు ఫెయిల్ కావడం. టాప్ స్కోర్ చేస్తామనే నమ్మకమున్న పేపర్లలోనే ఫెయిల్ అవడంతో వియార్థులు ఆందోళనకు దిగారు. చివరికి పేపర్ల మూల్యాంకనంలో తప్పిదాలు జరిగాయని ఒప్పుకున్న బోర్డు రీ వెరిఫికేషన్ చేసి ఈసారి ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఫలితాల్ని వెల్లడిస్తామని అన్నారు. కేసీఆర్, కేటీఆర్ సైతం ఇకపై పొరపాట్లు జరగవని హామీ ఇచ్చారు. కానీ వ్యవహారం చూస్తే బోర్డు గత తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో కొత్త తప్పుల్ని చేస్తోందని అర్థమవుతోంది.

ప్రథమ సంవత్సరం ఫలితాల్లో తెలుగులో 20 మార్కులతో ఫెయిల్ కావడంతో ఆరుట్ల అనామిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె సోదరి రీ వెరిఫికేషన్ దరఖాస్తు పెట్టింది. అందులో అనామికను ఈసారి 48 మార్కులతో పాసైనట్టు రిజల్ట్ వచ్చింది. దీంతో ఆమె సోదరి అనామిక మరణానికి బోర్డు తప్పిదమే కారణమని, వారిపై క్రిమినల్ కేసు పెడతామని అంది. విషయం బోర్డు సభ్యుల వద్దకు వెళ్లగా వేంటనే వారు పొరపాటు జరిగిందని అనామికకు వచ్చింది 48 మార్కులు కాదని 21 అని, గతం కంటే ఆమెకు ఈసారి ఒక్క మార్కు మాత్రమే పెరిగిందని చెప్పుకొచ్చింది.

ఈ వ్యవహారం చూస్తే మరణించిన విద్యార్థుల్లో ఏ ఒక్కరూ పాస్ కాలేదని చూపాలని, తద్వారా తమ తప్పిందం ఏమీ లేదని చేతులు దులుపుకోవాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుని పనిచేసున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. మరి కళ్ళ ముందే స్పష్టంగా కనిపిస్తున్న ఈ తతంగం పట్ల కేసీఆర్ సర్కార్ ఎలా స్పదిస్తుందో చూడాలి.